అమెరికాలో విమానాలు ఆగినయ్

అమెరికాలో విమానాలు ఆగినయ్

న్యూఢిల్లీ: అమెరికాలో బుధవారం విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ)కు చెందిన నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) సిస్టమ్​లో టెక్నికల్ లోపం కారణంగా విమానాలు ఎయిర్ పోర్టులకే పరిమితమయ్యాయని ఎన్​బీసీ న్యూస్ పేర్కొంది. అమెరికా నుంచి రాకపోకలు సాగించే దాదాపు 5,400 ఫ్లైట్లు ఆలస్యమయ్యాయని, 900 ఫ్లైట్లను రద్దయ్యాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ‘‘ఫ్లైట్ అవేర్’’ తెలిపింది. వాతావరణ సమస్యలు, రూట్లలో మార్పుచేర్పుల గురించి నోటమ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు పైలట్లను అలర్ట్ చేస్తుంది. అయితే టెక్నికల్ లోపంతో నోటమ్ సిస్టమ్ పని చేయడంలేదు. ‘‘నోటమ్ సిస్టమ్ ఫెయిల్ అయింది. అది ఎప్పుడు బాగవుతుందో తెలియదు” అని ఎఫ్ఏఏ పేర్కొంది. కాగా, విమాన సర్వీసులు ఆగిపోవడంతో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఫ్లైట్లు లేట్​ కావడం, మరికొన్నింటిని రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.

నెమ్మదిగా సర్వీసులు పెంచుతున్నాం: ఎఫ్​ఏఏ

నోటమ్​ లో సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులను నెమ్మదిగా పెంచుతున్నామని ఫెడరల్​ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​ అధికారులు తెలిపారు. కాగా, దేశం మొత్తమ్మీద విమాన సర్వీసులు ఆగిపోవడం షాకింగ్​ విషయమని ఏవియేషన్​ ఎక్స్​పర్ట్​ పర్వేజ్​ దమానియా చెప్పారు. గతంలో పెట్రోనాస్ టవర్లు కూలిపోయినపుడు ఇలాగే విమాన సర్వీసులను అధికారులు నిలిపివేశారని గుర్తుచేశారు.

సైబర్​ అటాక్​ జరిగిందా..?

వేలాది విమానాలు ఎక్కడివక్కడ నిలిచి పోవడానికి కారణం సైబర్​ దాడేనని జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా అధికారులు కొట్టిపారేశారు. సైబర్​ దాడి జరిగిందనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు దొరకలేదని చెప్పారు. కాగా, అమెరికాలో నోటమ్​ వ్యవస్థ మొరాయించడంతో తమ విమానాలపైనా ప్రభావం పడిందని ఎయిర్​ కెనడా ఓ ప్రకటనలో తెలిపింది.