బెదిరించిన్రు భయపెట్టిన్రు.. డబ్బులిచ్చిన్రు..

బెదిరించిన్రు భయపెట్టిన్రు.. డబ్బులిచ్చిన్రు..

క్యాష్.. కాదంటే కేస్,​ ఇల్లు కూల్చేస్తం, అంతు చూస్తమని హెచ్చరికలు మున్సిపాలిటీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల హల్​చల్ క్యాండిడేట్లను బలవంతంగా తీసుకొచ్చి మరీ విత్ డ్రాలు. ఏకగ్రీవాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు. మున్సిపల్ ఎలక్షన్ల నామినేషన్ల విత్ డ్రాకు ఆఖరి రోజైన మంగళవారం అధికార పార్టీ అడ్డదారులు తొక్కింది. పోటీలో ఉన్న ఇతర పార్టీల క్యాండిడేట్లను, ఇండిపెండెంట్లను భయపెట్టింది, బెదిరించింది. పోటీ నుంచి తప్పించి తమ క్యాం డిడేట్లను ఏకగ్రీవం చేసుకునేందుకు రకరకాల ఎత్తులు వేసింది. చాలాచోట్ల స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఇతర పార్టీల క్యాండిడేట్లు, ఇండిపెండెంట్లకు ప్రలోభాల ఎర వేశారు. లక్షల్లో డబ్బులు కుమ్మరించి, పోటీ నుంచి తప్పుకోవాలన్నారు. లేకుంటే ఏదో ఒక కేసులో ఇరికిస్తామని, పాత కేసులు తిరగదోడుతామని బెదిరించారు. చిక్కకుండా ఉన్నవారి ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులనూ బెదిరించారు.

కొందరిని బలవంతంగా ఆర్డీవో ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులకు తీసుకెళ్లి నామినేషన్లు విత్ డ్రా చేయించారు. ఏకగ్రీవాల కోసమే ప్లాన్ సీఎం మెప్పు పొందాలనే ఆరాటంతోనే మంత్రులు, ఎమ్మెల్యే లు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఎలక్షన్ ఖర్చు భరించి గెలుపోటముల వరకు ఎదురు చూడటం కంటే.. ధనబలం, కండబలం ప్రయోగించారు. ఏకగ్రీవాలతో వార్డులు, డివిజన్లు, మున్సిపాలి టీలను కైవసం చేసుకోవాలని ప్రయత్నించారు. హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలి టీలో కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొనేందుకు ఓ మంత్రి రూ.50 లక్షల వరకు ఆఫర్ చేసినట్టు సమాచారం. మరికొన్ని చోట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 56 వార్డులను టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఏకగ్రీవం చేసుకున్నారు.

ఆదిలాబాద్ జడ్పీ వైస్‍  చైర్మన్‍ ఆరె రాజన్న మంగళవారం పలువురు ఇండిపెండెంట్లను తన వెహికల్ లో తీసుకొచ్చి మరీ నామినేషన్లు విత్‍ డ్రా చేయించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డులో తొట్ల సంపత్ టీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ మొత్తం తొమ్మిది మంది పోటీలో నిలవగా.. బీజేపీ, కాంగ్రెస్ క్యాండిడేట్లను, ఇండిపెం డెంట్లను ప్రలోభపెట్టి, కొందరిని బెదిరించి విత్ డ్రా చేయించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో రామవరం పరిధిలోని ఐదు వార్డుల్లో రాత్రికి రాత్రి పోలీసులతో కార్డన్ సెర్చ్​చేయించి, పోటీలో ఉన్న వాళ్లను భయాందోళనకు గురిచేశారని స్థానికులు చెప్తున్నారు.

పరకాలలో పోటీ నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ నేతలు బీజేపీ క్యాండి డేట్లపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. కొందరికి రూ.5 లక్షలు ఆఫర్ చేసి బలవంతంగా విత్ డ్రా చేయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి మున్సి పల్ ఆఫీసు ముందు ఆందోళన చేశారు. హుస్నాబాద్ లో 13వ వార్డును ఏకగ్రీవం చేసుకునేందుకు అక్కడ పోటీలో ఉన్న బీజేపీ క్యాండిడేట్ ను బెదిరించారు. మరో వార్డును ఏకగ్రీవం  చేసుకునేందుకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. జనగామలో పోటీ నుంచి తప్పుకుంటే రూ.10 లక్షలు ఇస్తామంటూ ప్రత్యర్థులకు ఎరవేశారు.