సివిల్ కేసులతో బెదిరించి.. రూ.6 కోట్లు డిమాండ్‌‌

సివిల్ కేసులతో బెదిరించి..  రూ.6 కోట్లు డిమాండ్‌‌
  • లియో రిసార్ట్స్‌‌తో డెవలప్‌‌మెంట్‌‌ అగ్రిమెంట్స్
  • సంస్థ మేనేజ్ మెంట్ ఫిర్యాదుతో కేసు నమోదు 
  • బోధన్‌‌లో న్యాయవాదిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌‌,వెలుగు: లియో మెరిడియన్ రిసార్ట్స్, హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌ సంస్థ నిర్వాహకులను వేధిస్తున్నాడనే ఆరోపణలతో న్యాయవాది కె. దామోదర్‌‌‌‌ రెడ్డి(57)ని సిటీ సీసీఎస్‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని 12వ అడిషనల్‌‌ చీఫ్‌‌ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌‌ కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలతో దామోదర్‌‌‌‌రెడ్డికి కోర్ట్‌‌ బెయిల్‌‌ మంజూరు చేసింది.

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌‌ జిల్లా శామీర్‌‌పేట మండలం బొమ్మరాసిపేట్‌‌ కు చెందిన జి.శ్రీనివాస్ చక్రవర్తి రాజు లియో మెరిడియన్ రిసార్ట్స్ ఏర్పాటు చేశాడు. రిసార్ట్స్‌‌ నిర్మించగా మిగిలిన కొంత భూమిని డెవలప్‌‌మెంట్‌‌ చేసి విక్రయించాడు. వీటికి సమీపంలోనే సికింద్రాబాద్‌‌లో ఉండే లాయర్‌‌‌‌ దామోదర్ రెడ్డి భూమి కూడా ఉంది. భూ వివాదంలో లియో మెరిడియన్ రిసార్ట్స్‌‌పై లాయర్ సివిల్‌‌ కేసులు పెట్టాడు. ఆ తర్వాత 2006లో బొమ్మరాసిపేట్ సర్వే నెం.389లో 2 ఎకరాల భూమిని లియో మెరిడియన్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌‌తో డెవలప్‌‌మెంట్‌‌ అగ్రిమెంట్‌‌ చేసుకున్నాడు. ఒప్పందం మేరకు ప్లాట్స్‌‌ను రిజిస్టర్ చేయలేదు. 

ALSO READ:స్టార్​ సింబల్​ కరెన్సీ చెల్లుతుంది

దీంతో పాటు ఎండీ శ్రీనివాస్‌‌ చక్రవర్తిని అతని సిబ్బందిని వేధించడం ప్రారంభించాడు. కంపెనీని కేసుల్లో ఇరికించి ప్రతిష్టకు భంగం కలిగిస్తానని భయాందోళనకు గురి చేశాడు.తను ఫైల్ చేసిన సివిల్ సూట్స్‌‌ను విత్‌‌డ్రా చేసుకోవాలంటే రూ.6 కోట్లు డబ్బు డిమాండ్ చేశాడు. ఇందులో రూ.80 లక్షలు వసూలు చేశాడు.ఆ తర్వాత కూడా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో దామోదర్‌‌‌‌రెడ్డిపై శామీర్‌‌పేట్‌‌ పీఎస్‌‌లో 9 కేసులు నమోదయ్యాయి. కంపెనీ మేనేజ్​ మెంట్ కూడా గత జనవరిలో  సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బుధవారం బోధన్‌‌లో దామోదర్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌‌ తరలించారు.