ఉమ్మడి హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

ఉమ్మడి హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

షాద్ నగర్ : షాద్​నగర్​లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల బ్లూ ప్రింట్ గురించి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ జనాలకు వివరించాలని బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. షాద్​నగర్​లో అధికార పార్టీ నేతలు, అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని విమర్శించారు. షాద్ నగర్ సెగ్మెంట్ బీజేపీ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తూరు నుంచి షాద్ నగర్ పట్టణం మీదుగా అన్నారం చౌరస్తా వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు దారి తీస్తోందన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. కొత్తూరు నుంచి అన్నారం చౌరస్తా వరకు దాదాపు 10 కి.మీ.ల రోడ్డు విస్తరణ పనులకు రూ.49 కోట్లకుపైగా నిధులు మంజూరు కాగా.. ఇందులో పట్టణంలో మూడున్నర కి.మీ. విస్తరణకు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారన్నారు. మిగతా 7 కి.మీ. పనులను ఎలా పూర్తిచేస్తారని ఆయన ప్రశ్నించారు. విస్తరణలో నష్టపోయిన బాధితులకు పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ఆలయాల జోలికొస్తే ఊరుకోం
షాద్​నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ రథశాలను రోడ్డు విస్తరణ కార్యక్రమాల పేరుతో కూలిస్తే ఊరుకోబోమని బజరంగ్​దళ్, హిందూ వాహిని సంఘాలు ఆందోళనకు దిగాయి. మంగళవారం రథశాల ముందు ధర్నా చేపట్టాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత  నెలకొంది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం దేవాలయాలు, రథశాలను కూల్చాలనుకోవడం సరికాదని బజరంగ్ దళ్ విభాగం కో కన్వీనర్ గూడెం రమేశ్ హెచ్చరించారు. ఎంతో చరిత్ర ఉన్న పురాతన సంపదను కొల్లగొడితే చూస్తూ ఊరుకోమన్నారు. తొందరలోనే రాష్ట్రస్థాయిలో  ప్రణాళికను సిద్ధం చేసి ఆందోళన చేపడతామని పేర్కొన్నారు.

గ్యాస్ ట్యాంకర్ బోల్తా

ఎల్ బీనగర్ : అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం ఓ గ్యాస్‌‌ ట్యాంకర్‌‌ అదుపు తప్పి బోల్తా పడింది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌‌-–విజయవాడ హైవే కావడంతో  భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గుజరాత్ నుంచి వస్తున్న ట్యాంకర్ హైదరాబాద్, అబ్దుల్లాపూర్​మెట్ మీదుగా చెన్నై వెళ్తోంది. కాగా అబ్దుల్లాపూర్​మెట్ చౌరస్తా వద్దకు రాగానే ట్యాంకర్ అదుపుతప్పి అడ్డంగా పడిపోయింది. దీంతో రహదారికి ఇరువైపులా 2 కి.మీ. మేర వెహికల్స్​ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు డివై
డర్​ను తొలగించి ట్రాఫిక్​ను క్లియర్​చేశారు.

క్వారీ ఏర్పాటు వద్దు

షాద్​నగర్ : ఫరూఖ్​నగర్ మండలం వెలిజర్ల గ్రామ శివారులో ప్రతిపాదిత కర్ణపాల్ రెడ్డి క్రషర్ ప్లాంట్​కు సంబంధించి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మంగళవారం వెలిజెర్ల గ్రామ శివారులోని సర్వే నం.76, 77, 78 లోని దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో క్వారీ ఏర్పాటు కోసం జిల్లా అధికారులు,ఆర్డీవో రాజేశ్వరి సమక్షంలో క్రషర్ ప్లాంట్ పరిసర ప్రాంత రైతుల అభిప్రాయాలను సేకరించారు. అక్కడ క్వారీ ఏర్పాటు చేయొద్దంటూ వెలిజర్ల గ్రామస్తులు, రైతులు అభ్యంతరం తెలిపారు.  క్రషర్ మెషీన్​తో తమ పంటలకు నష్టం వాటిల్లుతుందని, వ్యవసాయానికి  ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాల నష్టంతో పాటు, పేలుడు శబ్దాలు, దుమ్ముతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లో క్రషర్ ప్లాంట్ ఏర్పాటు చేయొద్దని అధికారులకు చెప్పారు. రైతుల అభిప్రయాలను వీడియోలు తీసిన అధికారులు వాటిని ఉన్నతాధికారులకు చూపిస్తామని, పర్మిషన్ల అంశాలను వారు పరిశీలిస్తారని పేర్కొన్నారు.

పార్కింగ్ గొడవ.. డెలివరీ బాయ్​పై దాడి

మెహిదీపట్నం : బండి పార్కింగ్​విషయంలో జరిగిన గొడవలో స్విగ్గీ డెలివరీ బాయ్​పై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హుమాయున్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నం ప్రాంతానికి  చెందిన మహ్మద్ షకీబ్ (22) స్విగ్గీలో డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు.  సోమవారం రాత్రి ఆర్డర్ పై మాసబ్ ట్యాంక్ లోని 555 హోటల్​కు వెళ్లాడు. షకీబ్ బైక్ పార్కింగ్ చేస్తుండగా అదే ఏరియాకు  అహ్మద్ అక్కడికి వచ్చాడు.  పార్కింగ్ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని అహ్మద్ తన ఫ్రెండ్స్​కు ఫోన్​లో చెప్పడంతో నలుగురు వ్యక్తులు హోటల్ వద్దకు వచ్చి షకీబ్ పై దాడి చేశారు. ఈ దాడిలో అతడికి గాయాలు కావడంతో హాస్పిటల్​కు తరలించారు. బాధితుడి కంప్లయింట్ మేరకు అహ్మద్​తో పాటు అతడి ఫ్రెండ్స్ ఇంతియాజ్, ఆసర్, ఆబర్, ఆసిఫ్​పై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కిచెన్​లో హోటల్ సిబ్బంది మధ్య గొడవ
డెలివరీ బాయ్ పై దాడి జరిగిన కొద్దిసేపటికే 555 హోటల్​లో సిబ్బందికి మధ్య మరో విషయంలో గొడవ జరిగింది.  హోటల్​లో  పనిచేసే సోనూ, సజ్జల్ కిచెన్​లో మరో విషయంలో గొడవ పడ్డారు. అయితే కిచెన్​లో వారిద్దరితోపాటు ఇలియాస్ అనే వ్యక్తిపై కడాయిలో ఉన్న వేడి నూనె పడింది. దీంతో వారికి గాయాలయ్యాయి. హోటల్ ఓనర్ వారిని హాస్పిటల్​కు తరలించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.