ఆలయాల్లో చోరీలు చేస్తున్న ముగ్గురు అరెస్టు

ఆలయాల్లో చోరీలు చేస్తున్న ముగ్గురు అరెస్టు
  • 14 తులాల వెండి, నగదు స్వాధీనం
  • నిందితులపై 31 చోరీ కేసులు

మెట్ పల్లి, వెలుగు : ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను  పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి డీఎస్పీ రవీంద్ర రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మెట్ పల్లి కి చెందిన షేక్  హైదర్  17 చోరీ కేసుల్లో నిందితుడు. నిజామాబాద్  జిల్లా మోర్తాడ్ కు చెందిన ఎర్ర వెంకటి,  కొర్వ సంతోష్   చెరో ఏడు కేసుల్లో  జైలు పాలయ్యారు. జైల్లో ఉన్న ఆ ముగ్గురి మధ్య స్నేహం పెరిగింది. జైలు నుంచి బయటకు వచ్చాక  జల్సాల కోసం దేవాలయాల్లో దొంగతనాలు చేసేందుకు ముగ్గురు ప్లాన్  వేసేవారు. రెండు నెలల క్రితం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్  గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. 15 రోజుల క్రితం కోరుట్ల పట్టణంలోని  ఎల్లమ్మ గుడిలో హుండీ ఎత్తుకెళ్లారు.

తర్వాత రోజు ఇబ్రహీంపట్నం మండలం గోధురులోని పోచమ్మ గుడిలో హుండీ పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. నాలుగు రోజుల కిందట  కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలోని వాగు ఒడ్డున ఉన్న రామాలయం గుడి హుండీ పగలగొట్టి నగదు,  ఆ తర్వాత రోజు మెట్ పల్లి మండలంలోని రామలచక్కపేట శివాలయం,  జగ్గాసాగర్   రామాలయం, గంగమ్మ  దేవాలయం,  ఆత్మా నగర్  మల్లన్న, హనుమాన్  ఆలయాల తాళాలు పగలగొట్టి వెండి, బంగారు నగలు, హుండీ నగదును చోరీ చేశారు. ఆలయాల్లో జరుగుతున్న  వరుస దొంగతనాలపై పోలీసులు దృష్టి సారించారు. దొంగలను పట్టుకునేందుకు  మెట్ పల్లి  సీఐ లక్ష్మీనారాయణ  ఆధ్వర్యంలో మల్లాపూర్  ఎస్సై నవీన్  కుమార్, మెట్ పల్లి  ఎస్సై చిరంజీవి   రెండు టీములుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి దొంగలను గుర్తించారు. మల్లాపూర్  మండలం ముత్యంపేట శివారు నిజాం షుగర్  ఫ్యాక్టరీ వద్ద బైకుపై వెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9 వేల నగదు, బైక్, 14 తులాల వెండి, తాళాలు పగులగొట్టే కొంకి స్వాధీనం చేసుకున్నారు.