ఆడుకుంటూ వెళ్లి.. నీటిలో మునిగి..

ఆడుకుంటూ వెళ్లి.. నీటిలో మునిగి..

వరంగల్, కాశిబుగ్గ, వెలుగు: ఒక్క సెలవు దినం.. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అభంశుభం తెలియని పిల్లల ప్రాణాలను బలిగొని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ బడులకు సెలవు కావడంతో ముగ్గురు చిన్నారులు చెరువులో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని 11వ డివిజన్​పరిధి క్రిస్టియన్ కాలనీకి చెందిన బరిగెల అర్పిత -సుందర్​రాజు, ఆకినెపల్లి శ్రీలత- రాజ్​కుమార్, విప్ప ఆశాదేవి- రాములు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అర్పిత సుందర్​రాజు కూతురు రుచిత(5) స్థానిక ప్రభుత్వ బడిలో రెండో తరగతి చదువుతుండగా.. శ్రీలత రాజ్​కుమార్​ల కుమారుడు ధనధీర్​(9), ఆశాదేవి రాములు కుమారుడు ప్రణీత్​(9) గ్రేన్​ మార్కెట్​స్కూల్​లో నాలుగో తరగతి చదువుతున్నారు. అర్పిత, ఆశాదేవి అక్కచెల్లెల్లు కావడం.. అందులోనూ పక్కపక్కనే నివాసం ఉంటుండటంతో వారి పిల్లలు రుచిత, ప్రణీత్​ నిత్యం కలిసి ఆడుకునేవారు. వీళ్ల ఇంటి పక్కనే ఉండే ధనధీర్​ కూడా వీరితో జతకట్టేవాడు. గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం అన్ని ప్రభుత్వ బడులకు సెలవు కావడంతో ఉదయం ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ పక్కనే గొర్రెకుంట క్రాస్​ 2వ డివిజన్​ పరిధిలోకి వచ్చే కట్టమల్లన్న చెరువు సమీపంలోకి వెళ్లారు. స్నానానికని చెరువులోకి ఒకరి తరువాత ఒకరు దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు పిల్లలు మునిగిపోయారు. దూరంగా ఉన్నవారు గమనించి అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడకు చేరుకుని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే చిన్నారులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపడుతూనే గీసుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కొద్దిసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.