ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. శుక్రవారం తెల్లవారుజామున కాంగ్‌పోక్సి జిల్లాలోని లోయిబోల్ గ్రామంపై సాయుధ దుండగులు దాడి చేశారు. ఇండ్లకు నిప్పు పెట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అనేక ఇండ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో గ్రామస్తులు భయంతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఉదయం 4 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు గ్రామంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఇండ్లకు నిప్పు పెట్టారు. దీంతో పలు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
