పూరీ‑అయోధ్య‑ కాశీ రూట్లలో.. మరో మూడు భారత్ గౌరవ్ రైళ్లు

పూరీ‑అయోధ్య‑ కాశీ రూట్లలో.. మరో మూడు భారత్ గౌరవ్ రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు: పుణ్యక్షేత్రాల యాత్ర కోసం ప్రవేశపెట్టిన భారత్​ గౌరవ్​ ట్రైన్​ల సంఖ్యను దక్షిణ మధ్య రైల్వే పెంచింది. 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న  పూరీ–అయోధ్య–కాశీ రూట్లలో మరో మూడు  రైళ్లను నడపనుంది. ఈ మేరకు షెడ్యూల్​ను రైల్వే అధికారులు విడుదల చేశారు. ఈ నెల 28, జులై 12, 26 తేదీలలో సికింద్రాబాద్​ నుంచి ఈ మూడు రైళ్లు బయలుదేరనున్నాయి. 28న బయలుదేరే రైలు తిరిగి జులై 6న సికింద్రాబాద్​కు చేరుకుంటుంది. అదేవిధంగా జులై 12న బయలుదేరే రైలు తిరిగి జులై 20న, 26న బయలుదేరే  రైలు ఆగస్టు 3న యాత్ర పూర్తి చేసుకుని సికింద్రాబాద్ కు చేరుకుంటాయి.

తెలుగు రాష్ర్టాల్లోని ప్రయాణికుల సౌకర్యార్థం  కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.  పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్​రాజ్​ తీర్థ స్థలాలను భారత్​ గౌరవ్​ ట్రైన్​లు కవర్​చేస్తాయి. మొత్తం తొమ్మిది రోజుల వ్యవధిలో యాత్ర పూర్తవుతుంది. టికెట్​బుకింగ్, ఇతర వివరాల కోసం http://www.irctctourism.com వెబ్​సైట్​ను సందర్శిం చాలని అధికారులు కోరారు.