పాస్​పోర్టుల జారీ కేసులో ముగ్గురు పోలీసులు అరెస్ట్

పాస్​పోర్టుల జారీ కేసులో ముగ్గురు పోలీసులు అరెస్ట్

హైదరాబాద్‌,వెలుగు : విదేశీయులకు ఇండియన్‌ పాస్‌పోర్ట్స్‌ జారీ కేసులో సీఐడీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాస్ పోర్టుల జారీలో కీలకపాత్ర పోషించిన ఎస్‌ఆర్‌‌నగర్‌‌ బీకే గూడకు చెందిన పాస్‌పోర్ట్ ఏజెంట్ కొప్పిశెట్టి కళ్యాణ్, మారేడ్‌పల్లి ట్రాఫిక్ ఏఎస్‌ఐ తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్‌ఐ నజీర్ బాషా, షీ టీమ్స్ ఏఎస్‌ఐ గుంటూరు వెంకటేశ్వర్లును ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. దీంతో అరెస్టైన నిందితుల సంఖ్య 22కు చేరిందని  సీఐడీ చీఫ్ శిఖాగోయల్‌ తెలిపారు. ఓల్డ్ సిటీకి చెందిన ఏజెంట్‌ అబ్దుల్​ సత్తార్ ఉస్మాన్‌ అల్ జహ్‌వరి గ్యాంగ్‌ శ్రీలంకకు చెందిన 95మంది సహా మొత్తం 125 మందికి ఇండియన్‌ పాస్ట్‌పోర్టులు ఇప్పించారు.

జనవరిలో 12 మందిని అరెస్ట్ చేసిన సీఐడీ 

హైదరాబాద్‌, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల అడ్రెస్‌ల పేరుతో ఫేక్‌ ఆధార్‌‌, బర్త్‌, స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్షియల్‌ ప్రూఫ్స్‌తో పాస్‌పోర్ట్‌లు జారీ చేయించారు. ఈ కేసులో జనవరి 20న సీఐడీ పోలీసులు12 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ ఉస్మాన్‌ అల్ జహ్‌వరిని సహా నిందితులను కస్టడీలోకి తీసుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో దర్యాప్తు చేశారు.పాస్‌పోర్టులు ఇప్పించిన కళ్యాణ్​తోపాటు  ఏఎస్‌ఐలు తిప్పన్న, నజీర్‌‌బాషా,వెంకటేశ్వర్లుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది ఏజెంట్లు, పోలీసులు అరెస్టయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.