ఆ జైలు నుంచి తప్పించుకోవడం అంటే ప్రాణం వదులుకున్నట్టే...!

ఆ జైలు నుంచి తప్పించుకోవడం అంటే ప్రాణం వదులుకున్నట్టే...!

అది ప్రపంచంలోనే అతి కట్టుదిట్టమైన జైలు. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడమంటే ప్రాణం వదులుకున్నట్టే. చుట్టూ నీళ్ల మధ్యలో ఉంటుంది ఆ జైలు. గేటు దూకి  బయటికి వెళ్తే.. సముద్రంలో పడిపోతారు. ఒకవేళ ఈదుతూ అవతలి ఒడ్డుకి చేరితే గార్డుల చేతికి చిక్కుతారు. జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నించి కొందరు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి జైలు నుంచి ముగ్గురు కిలాడీ ఖైదీలు సబ్బులు, ఇనుప చువ్వలు, స్పూన్లు.. లాంటివి ఉపయోగించి చాలా ఈజీగా తప్పించుకున్నారు. కానీ.. ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారనేది ఇప్పటికీ తెలియలేదు. 

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో పక్కన సముద్రం మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉంది. దాన్ని1775లో లెఫ్టినెంట్ జువాన్ మాన్యుయెల్ డి అయాలా కనుక్కున్నాడు. తర్వాత దానికి ‘‘ఇస్లా డి లాస్ ఆల్కాట్రేసెస్” అని పేరుపెట్టాడు. అది తర్వాత కాలంలో అల్కాట్రాజ్​గా మారింది. 1849లో ఆ ఐల్యాండ్​ అమెరికా గవర్నమెంట్​ ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ద్వీపంలో కొన్ని బిల్డింగ్స్​ కట్టారు.1861లో జైలు ఏర్పాటు చేశారు. అందులో అంతర్యుద్ధంలో పట్టుబడిన ఖైదీలను ఉంచేవాళ్లు.1934 నాటికి ప్రపంచంలోని అత్యంత సేఫెస్ట్​ జైలుగా ఇది గుర్తింపు పొందింది.1930 నుంచి ఆ ఐల్యాండ్​కి వెళ్లేందుకు ప్రజలకు పర్మిషన్​ లేదు. ఐల్యాండ్​ చుట్టూ సముద్రపు నీళ్లు, గదులకు పెద్ద పెద్ద ఇనుప కడ్డీలు, జైలు చుట్టూ గార్డ్స్​ టవర్లు ఉండేవి. ప్రతి రోజూ12 సార్లు ఖైదీలను చెక్​ చేసేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పించుకోవడం చాలా కష్టం.1934 నుండి1963 నాటికి జైలు మూసివేసే వరకు14 సార్లు ఖైదీలు ఎస్కేప్​కి ప్లాన్​ చేశారు. కానీ.. ఆ ప్లాన్స్​ అన్నీ ఫెయిల్​ అయ్యాయి. 36 మంది పట్టుబడ్డారు. కానీ.. చివరగా ముగ్గురు మాత్రం పెద్ద ప్లాన్​ వేసి అక్కడినుంచి తప్పించుకోగలిగారు. 

ముగ్గురు మొనగాళ్లు

ఫ్రాంక్ మోరిస్ బ్యాంక్ దోపిడీ, మరికొన్ని నేరాలు చేసి చాలాసార్లు జైళ్ల ఊచలు లెక్కపెట్టాడు. జైళ్ల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. కొన్నిసార్లు సక్సెస్​ కూడా అయ్యాడు. అలాంటివాడిని తీసుకొచ్చి 1960లో ఆల్కాట్రాజ్‌‌ జైలులో పెట్టారు. ఆ మరుసటి ఏడు అదే జైలుకు జాన్ ఆంగ్లిన్ అతని తమ్ముడు క్లారెన్స్ కూడా ఖైదీలుగా వచ్చారు. ఈ ముగ్గురికీ జైలులో మంచి స్నేహం ఏర్పడింది. ముగ్గురూ కలిసి తప్పించుకోవాలని డిసైడ్​ అయ్యారు. ఇలాంటి పనుల్లో మంచి స్కిల్స్​ ఉన్న మోరిస్ దీనికి ప్లాన్ గీశాడు. ​ వాళ్లకు అలెన్ వెస్ట్ అనే మరో ఖైదీ సాయం చేశాడు. 

డమ్మీ తలలు పెట్టి.. 

జూన్ 11, 1962న రాత్రి గార్డు వచ్చి ఖైదీల బెడ్లు చెక్​ చేశాడు. లెక్క సరిగానే ఉంది. అందరూ వాళ్ల గదుల్లోనే ఉన్నారు. ఉదయాన్నే మరో గార్డు వచ్చి ఖైదీలను లెక్కిస్తున్నాడు.  ఒక గార్డు మోరిస్​ని పిలిస్తే పలకలేదు. దాంతో తలను కర్రతో చిన్నగా నెట్టాడు. వెంటనే బెడ్​మీది తల కింద పడింది. గార్డు కంగారుపడి చూస్తే.. అది డమ్మీ హెడ్​. ఆ తర్వాత అన్ని రూమ్స్​ చెక్​ చేశారు. జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ కూడా కనిపించలేదు. వాళ్ల ప్లేసుల్లో డమ్మీ హెడ్​లు ఉన్నాయి. రాత్రంతా సెంట్రీలు ఆ తలలను చూసి వాళ్లే ఉన్నారేమో అనుకున్నారు. వాళ్లు సబ్బులతో తలలు చేశారు. ఆ జైల్లో ఫర్నిచర్​ తయారు చేసేవాళ్లు. వాటికి వేయడానికి రంగు డబ్బాలు తీసుకొచ్చేవాళ్లు. వాటిలో నుంచి కొంత రంగు దాచుకుని తలలకు వేశారు. సెలూన్​లో కత్తిరించిన ఖైదీల జుట్టు ఆ తలలకు అతికించారు. బెడ్​పై దుప్పటి కప్పి చివర్లో తల పెట్టారు.  రాత్రి డ్యూటీలో ఉన్న గార్డులు వాటిని చూసి మోసపోయారు. వాళ్లు తప్పించుకున్నారని తెలియగానే  పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 

ప్లానింగ్

తప్పించుకోవడానికి ఏడు నెలల ముందే పక్కా ప్లాన్​ వేసుకున్నారు. వాళ్లలో ఒకరికి జైల్లో కొన్ని పాత రంపపు బ్లేడ్‌‌లు దొరికాయి. మరొకరికి విరిగిన వాక్యూమ్ క్లీనర్, ఇనుప చువ్వలు దొరికాయి. అందులోని మోటారుతో ఒక డ్రిల్‌‌ మెషిన్​ తయారు చేశారు. ఆ మెషిన్​, రంపం, ఇనుప చువ్వలు, ఫోర్క్‌‌లు, చెంచాలు ఉపయోగించి బాత్రూమ్​లో ఉన్న వెంటిలేటర్​ రంధ్రాన్ని పెద్దగా చేశారు. ప్రతి రోజూ జైల్లో మ్యూజిక్​ సెషన్​ ఉండేది.  ఆ టైంలో ఖైదీలంతా పాటలు పాడేవాళ్లు. ఆ టైంలో వీళ్లు సౌండ్స్​ చేసినా ఎవరికీ వినిపించవని, అదే టైంలో రంధ్రం చేసేవాళ్లు. జైల్లో అమెరికా ఆర్మీ ఆఫీసర్ల కోసం బట్టలు కుట్టేవాళ్లు. ఫర్నిచర్​ తయారు చేసేవాళ్లు. అక్కడ మిగిలిన రబ్బరు వస్తువులు, యాభై రెయిన్​ కోట్లు దొంగిలించారు. వాటితో లైఫ్​ జాకెట్లు తయారుచేసుకున్నారు. 

తప్పించుకునేటప్పుడు వాటిని కూడా వెంట తీసుకెళ్లారు. వాటి సాయంతో దగ్గర్లో ఉన్న ఒక ఐల్యాండ్​కి వెళ్లి, అక్కడున్న చిన్న పడవ సాయంతో తప్పించుకున్నారు. బ్యూరో ఆఫ్ ప్రిజన్ ఆఫీసర్లు చెప్పినదాని ప్రకారం.. వాళ్లు జైలు నుంచి సక్సెస్​ఫుల్​గా ఎస్కేప్​ అయ్యారు. అవతలి ఒడ్డుకు కూడా చేరుకున్నారు. కానీ.. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. ఎఫ్​బీఐ లాంటి ఇన్వెస్టిగేషన్​ సంస్థలు ఎంక్వైరీ చేసినా లాభం లేకపోయింది. దాంతో వాళ్లు నీళ్లలో మునిగి చనిపోయి ఉండొచ్చని ప్రకటించింది గవర్నమెంట్​. కానీ.. కొన్నేండ్ల తర్వాత శాన్​ఫ్రాన్సిస్​కో పోలీస్​ స్టేషన్​కు ఒక లెటర్​ వచ్చింది. దాన్ని జాన్ ఆంగ్లిన్ రాశాడు. అందులో ‘‘మేము సక్సెస్‌‌ఫుల్​గా తప్పించుకున్నాం. ఇంకా బతికే ఉన్నాం” అని రాశాడు. కంగారుపడ్డ పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఆ లెటర్​లో ఉన్న హ్యాండ్​ రైటింగ్​ ఆంగ్లిన్​దే అని తేల్చారు. దాంతో మళ్లీ వాళ్ల పేర్లను వాంటెడ్​ క్రిమినల్స్​ లిస్ట్​లో చేర్చారు.