శామీర్‌పేట, వెలుగు: శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఒకే రాత్రి మూడు చోట్ల దొంగతనాలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి కిరాణా దుకాణం, ఎరువుల దుకాణం, ఆలయ హుండీని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగుడు కిరాణా దుకాణం షట్టర్ తాళం పగులగొట్టి కౌంటర్‌లో ఉన్న నగదును దోచుకెళ్లాడు. ఫర్టిలైజర్ దుకాణంలో సుమారు రూ.40 వేలు అపహరించాడు.
గ్రామపంచాయతీ ఎదుట ఉన్న శివాలయంలోని హుండీని పగులగొట్టి అందులోని డబ్బులు తీసుకుని, హుండీని ఖాళీ స్థలంలో పడేసి వెళ్లాడు. ఉదయం షాపులు తెరవడానికి వచ్చిన యజమానులు తాళాలు విరిగి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
