
- ఘటన జరిగి మూడు రోజులైనా నిందితులను అరెస్టు చేయలేదేం?
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా పోలీసులు ఇంకా నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. చిన్నారిపై కొందరు దుండగులు ఒడిగట్టిన ఈ అమానుష చర్యను మీడియా కూడా వెలుగులోకి తీసుకురాకపోవడం బాధాకరం అని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించిన నిందితులను వేగంగా అరెస్టు చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాని, దోషులు యథేచ్ఛగా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.