కల్వర్టు గుంతలో పడిన బైక్‌‌‌‌.. ముగ్గురు మృతి..సంగారెడ్డి జిల్లా జూకల్‌‌‌‌ శివారులో ప్రమాదం

కల్వర్టు గుంతలో పడిన బైక్‌‌‌‌.. ముగ్గురు మృతి..సంగారెడ్డి జిల్లా జూకల్‌‌‌‌ శివారులో ప్రమాదం
  • జగిత్యాల జిల్లాలో యాక్సిడెంట్‌‌‌‌ దంపతులు దుర్మరణం
  • ఖమ్మం జిల్లాలో బైక్‌‌‌‌ను ఢీకొట్టిన లారీ, అక్కాతమ్ముడు మృతి

నారాయణ్‌‌‌‌ఖేడ్‌‌‌‌, వెలుగు : కల్వర్టు నిర్మాణం కోసం తీసిన గుంతలోకి బైక్‌‌‌‌ దూసుకెళ్లడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా జూకల్‌‌‌‌ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నారాయణఖేడ్‌‌‌‌ మండలం నర్సాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన అవుటి నర్సింలు (27), జిన్న మల్లేశ్‌‌‌‌ (24), జిన్న మహేశ్‌‌‌‌ (23) బంధువులు. ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు కలిసి తమ బంధువును నారాయణఖేడ్‌‌‌‌లో విడిచి పెట్టేందుకు రెండు బైక్‌‌‌‌లపై వెళ్లారు. 

తర్వాత ముగ్గురు కలిసి ఒకే బైక్‌‌‌‌పై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో జూకల్‌‌‌‌ శివారులోని డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్ల సమీపంలో కల్వర్టు నిర్మాణం కోసం తీసిన గుంతలో పడిపోయారు. నారాయణఖేడ్‌‌‌‌ వెళ్లిన యువకులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో వారిని వెతుక్కుంటూ మహేశ్‌‌‌‌ తండ్రి భూమన్న బయలుదేరాడు. కల్వర్టు వద్దకు రాగానే అనుమానంతో గుంతలో టార్చ్‌‌‌‌లైట్‌‌‌‌ వేసి చూడగా.. ముగ్గురి డెడ్‌‌‌‌బాడీలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్‌‌‌‌బాడీలను వెలికి తీయించారు. 

టీవీఎస్‌‌‌‌ను ఢీకొట్టిన టవేరా.. దంపతులు మృతి

గొల్లపల్లి, వెలుగు : టీవీఎస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ఎల్‌‌‌‌ను టవేరా ఢీకొట్టడంతో దంపతులు చనిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గొల్లపల్లికి చెందిన రెడపాక లింగయ్య (58), లచ్చవ్వ (54) భార్యాభర్తలు. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరూ కలిసి టీవీఎస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ఎల్‌‌‌‌పై జగిత్యాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గొల్లపల్లి శివారులోకి రాగానే టవేరా ఢీకొట్టింది. ప్రమాదం లచ్చవ్వ అక్కడికక్కడే చనిపోగా.. లింగయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు ఆయనను హాస్పిటల్‌‌‌‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. 

రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి

సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులో బైక్‌‌‌‌ను లారీ ఢీకొట్టడంతో అక్కాతమ్ముడు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే... పెనుబల్లి మండలం సూరయ్య బంజర తండాకు చెందిన పుచ్చా రమాదేవి, కృష్ణయ్య దంపతుల కుమార్తె తేజశ్విని(18)కి ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కండ్రికగూడెంకు చెందిన తోట మధుతో ఐదు నెలల కింద వివాహమైంది.

 సూరయ్యబంజర తండాలో బంధువు అనారోగ్యంతో బాధపడుతుండడంతో పరామర్శించేందుకు తేజశ్విని, మధు వెళ్లారు. అనంతరం తేజశ్విని తమ్ముడు దేవేందర్‌‌‌‌ (13)తో కలిసి ముగ్గురు బైక్‌‌‌‌పై స్వగ్రామానికి వస్తున్నారు. సత్తుపల్లి శివారులోకి రాగానే బైక్‌‌‌‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టి, వారిపై నుంచి వెళ్లింది. ప్రమాదంలో తేజశ్విని, దేవేంద్ర అక్కడికక్కడే చనిపోగా.. మధుకు 

తీవ్రగాయాలయ్యాయి.