విషాదాంతమైన వివాహ వేడుక.. వాగులో గల్లంతై ముగ్గురు యువకులు మృతి

విషాదాంతమైన వివాహ వేడుక.. వాగులో గల్లంతై ముగ్గురు యువకులు మృతి

సిద్దిపేట జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.  స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. వర్గల్ మండలం నాచారంలోని హల్దీ వాగులో జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు స్నేహితులు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసుల సమాచారం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన ఎర్రగుళ్ల ప్రశాంత్, వికాస్ , కొంతమి ఆనంద్ రెడ్డి అనే ముగ్గురు యువకులు నిన్న తూప్రాన్ లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం వారు నాచారానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న హల్దీ వాగులో స్నానం  చేసేందుకు వాగులోకి దిగారు.

వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం లేదా లోతు అంచనా వేయలేకపోవడంతో ముగ్గురూ ఒక్కసారిగా నీటిలో గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. సుదీర్ఘ గాలింపు తర్వాత ప్రశాంత్, వికాస్ ,ఆనంద్ రెడ్డిల మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు.

మృతులందరూ 27 ఏళ్ల వయస్సు కలిగిన వారే కావడంతో నర్సాపూర్‌లో విషాద వాతావరణం నెలకొంది. చేతికి అందిన కొడుకులు విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి వేడుకలో సరదాగా గడిపిన వారు.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ఆ గ్రామాన్ని కలిచివేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.