ఖమ్మం నగర అభివృద్ధికి కృషి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం నగర అభివృద్ధికి కృషి :  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  •     మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు మెరుగైన సౌలతులు అందించేందుకు ప్రభుత్వం రాజకీయాలకతీతంగా కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. గురువారం ఖమ్మం కార్పోరేషన్  పరిధిలో రూ.10 కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్, రోడ్డు నిర్మాణ పనులకు, యూపీఎస్  అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేతాజీ పార్క్, డీఎఫ్టీ స్కీమ్  కింద తాగునీరు సరఫరాను ప్రారంభించారు. 

అల్లీపురం మండల పరిషత్  ప్రైమరీ స్కూల్​ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తాను గెలిచిన ప్రతిసారీ రోడ్లు, మంచి నీరు, విద్య, వైద్యం సౌకర్యంతో పాటు భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఖమ్మం జిల్లా చరిత్రలో తనకు ఒక పేరు ఉండేలా చూసుకున్నానని తెలిపారు. 

దేశవ్యాప్తంగా ఖమ్మం జిల్లాకు మంచి పేరు వచ్చేలా పని చేశామని చెప్పారు. ఖమ్మం మేయర్  పూనుకొల్లు నీరజ మాట్లాడుతూ 24 గంటల పాటు నీరు వచ్చేలా అల్లిపురంలో ఏర్పాట్లు చేశానన్నారు. రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధికి ఐదేండ్లుగా ఖమ్మం కార్పొరేషన్​ పాలకవర్గం కృషి చేసిందని తెలిపారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను మంత్రి తుమ్మల ఘనంగా సన్మానించారు. కలెక్టర్  దివాకర టీఎస్, అడిషనల్​ కలెక్టర్  డాక్టర్  పి. శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్  రాయల నాగేశ్వర రావు, డిప్యూటీ మేయర్  ఫాతిమా జోహ్రా పాల్గొన్నారు.