ఒకేసారి మొత్తం రుణమాఫీ చేస్తం...మంత్రి తుమ్మల

ఒకేసారి మొత్తం రుణమాఫీ చేస్తం...మంత్రి తుమ్మల
  • పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: చెడగొట్టు వానలకు పంట నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని, ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.  గత ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేస్తే ఇప్పడు ప్రతికూల పరిస్థితుల్లో రైతులను ఆదుకునే పరిస్థితి ఉండేదన్నారు. 2020, 2021, 2023 ఏండ్లలో భారీ వర్షాలకు రైతులు నష్టపోతే.. నేడు -2024లో వర్షాలు లేక పంటలు ఎండే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వానికి భిన్నంగా వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ కుంగిపోవడంతో యాసంగిలో రైతులకు శాపంగా మారిందని తెలిపారు. రుణమాఫీపై ఎన్నికలు వచ్చినప్పుడల్ల రైతులను మభ్యపెడుతూ చివరికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఔటర్ రింగ్ రోడ్ కుదవ పెట్టి సగం మంది రైతులకే మాఫీ చేశారని విమర్శించారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామన్నారు. దీనిలో భాగంగా రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకులతో కలిసి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క రైతు ప్రకృతి వైపరిత్యాలతో నష్ట పోకూడదని రైతులు కట్టే ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టడానికి సిద్ధపడి, వచ్చే వానాకాలం నుంచి పంట బీమా అమలు చేస్తామని 
ప్రకటించారు.