
మునుగోడు(మర్రిగూడ), వెలుగు: అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజిలాపురం, సరంపేట, రాంరెడ్డిపల్లి, దామెర భీమనపల్లి పరిసరాలలో కొన్ని నెలలుగా చిరుత తిరుగుతోంది. పొలాల దగ్గర కట్టేసిన దూడలు, మేక పిల్లలపై దాడి చేసి చంపేస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులి ఆచూకీ కోసం ప్రయత్నించిన అటవీ అధికారులు ఆనవాళ్లు కనిపించకపోవడంతో హైనా అని అనుకున్నారు. అజిలాపురం గ్రామానికి చెందిన ధర్మా నాయక్ అనే రైతు ఎకరంలో వేసిన టమాటా తోటను అడవి పందులు ధ్వంసం చేస్తుండడంతో సోమవారం పొలంలో ఉచ్చులను ఏర్పాటు చేశాడు. ఉదయం తోట దగ్గరికి వెళ్లి చూసేసరికి ఉచ్చులో బిగుసుకున్న చిరుత పులి కనిపించింది. వెంటనే గ్రామానికి వచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు. అటవీ శాఖ అధికారులు పులికి మత్తు మందు ఇచ్చిన అనంతరం హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కు కు తరలించారు.