బిగుస్తోన్న ఉచ్చు.. కమర్షియల్ టాక్స్ స్కామ్ లో కీలక పరిణామాలు

బిగుస్తోన్న ఉచ్చు..  కమర్షియల్ టాక్స్ స్కామ్ లో కీలక పరిణామాలు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు, స్కామ్‌లను, బయటకు లాగుతోంది. ఇప్పటికే గొర్రెల పంపకం వంటి పథకాల్లో భారీ ఎత్తున అవినీతిని బయటపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. 1000 కోట్ల రూపాయల భారీ కుంభకోణంలో మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ మీద పోలీసులపై కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో దాదాపుగా రూ.వెయ్యి కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. 

ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌తో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఐదో నిందితుడిగా సోమేష్ కుమార్ పేరును చేర్చడం తాజాగా రాష్ట్రంలో సంచలనంగా మారింది. తాజాగా కమర్షియల్ టాక్స్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో మరి కొంత మందికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అసెంబ్లీ లో దీనిపై చర్చ తర్వాత అరెస్ట్ లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత ఈ కేసు పై సీరియస్ యాక్షన్ ఉంటుందని అధికారుల్లో చర్చ జరుగుతోంది.  

ఇందులో1,400 కోట్లు స్కామ్ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఐదు మందిపై కేసు నమోదు చేసిన CCS పోలీసులుఅసెంబ్లీ చర్చ తర్వాత మరింత మందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కాగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారం పై ఇప్పటికే  సీసీఎస్ పోలీసులు  ఆధారాలు సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారుల కార్యకలాపాలు, వివరాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆన్ లైన్ లో కనిపించకుండా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  వీరంతా పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. 

కమర్షియల్ టాక్స్, ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను సైతం వారు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్ వేర్ లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్ కి చేరేలా ఆదేశాలు జారీ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఆ గ్రూప్ లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. తెలంగాణా బేవరెజస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ టాక్స్ కు వేయి కోట్లు నష్టం జరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  మరో 11 ప్రయివేటు సంస్థలు కూడా రూ.400 కోట్లు వరకు పన్నులు ఎగవేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.