- కెనడా, యూఏఈ, జర్మనీ, సింగపూర్, ఫ్రాన్స్, సౌత్ కొరియావైపు మొగ్గు
- కొత్తగా ‘ఎండ్ హెచ్1బీ వీసా అబ్యూజ్ యాక్ట్ 2026’ బిల్లును తెచ్చిన అమెరికా
- వార్షిక వీసాల సంఖ్య 65 వేల నుంచి 25 వేలకు కుదింపు
- వార్షిక వేతనం రూ.2 కోట్లుంటేనే వీసా.. విద్యార్థుల ఆప్ట్ ప్రోగ్రామ్ రద్దు
- డిపెండెంట్ ఉద్యోగ వీసా హెచ్4 రద్దు చేసేలా కొత్త రూల్స్
- అమెరికాకు తగ్గిన స్టూడెంట్ వీసాల అప్లికేషన్లు
- తొలి ప్రాధాన్యంగా కెనడా.. ఆ తర్వాత జర్మనీ వైపు మనోళ్ల చూపు
హైదరాబాద్, వెలుగు: వీసా రూల్స్‌ను అమెరికా కఠినతరం చేస్తుండడంతో ఇండియన్స్ ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు. ఏటా ఇచ్చే వీసాల సంఖ్యను తగ్గించేస్తుండడం, దానికితోడు కొత్త నిబంధనలు పెడుతుండడంతో ఇప్పటికే అక్కడ ఉంటున్న ఇండియన్లు అమెరికాను వీడాలనుకుంటున్నారు. దానికితోడు అమెరికాకు స్టూడెంట్ వీసా అప్లికేషన్లూ తగ్గిపోతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఇండియన్లలో దాదాపు 40 శాతం మంది దాకా ఆ దేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో తేటతెల్లమైంది.
అంతేగాకుండా.. నిరుడు ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టూడెంట్ల వీసాలకు పెట్టుకున్న అప్లికేషన్లలో 25 వేల దాకా తగ్గుదల కనిపించింది. అమెరికా కాకుండా కెనడా, జర్మనీ, బ్రిటన్, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ కొరియా, ఫ్రాన్స్‌లాంటి దేశాలవైపు చూస్తున్నారు. ఇమిగ్రేషన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, తెస్తున్న కొత్త నిబంధనలే ఇతర దేశాలవైపు ఇండియన్స్ మొగ్గుచూపేలా చేస్తున్నాయని ఇమిగ్రేషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
రెండు వారాల క్రితం ట్రంప్ ప్రభుత్వం.. అమెరికా కాంగ్రెస్‌లో ‘ఎండ్ హెచ్1బీ వీసా అబ్యూజ్ యాక్ట్ 2026’ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పాసైతే ఇండియన్లు సహా.. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి పెద్ద ఎదురుదెబ్బగానే అది మిగిలిపోనున్నది. ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ బిల్లు ప్రకారం.. మూడేండ్లపాటు హెచ్1 బీ వీసాలను నిలుపుదల చేస్తారు. అంతేగాకుండా.. ఏటా 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంటారు. ఆ సంఖ్యను ఈ కొత్త బిల్లు ద్వారా 25 వేలకు తగ్గించనున్నారు.
ఇక, హెచ్1బీ వీసా రావాలంటే కనీసం 2 లక్షల డాలర్ల (సుమారు రూ.1.90 కోట్ల) వార్షిక వేతన ప్యాకేజీ ఉండాలన్న నిబంధనను పొందుపరిచారు. ఇంతకుముందు ఆ వేతన పరిమితి 65 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లుగా (సుమారు రూ.62 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు) ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని పెంచడం వల్ల ఆ శాలరీ రేంజ్‌లో ఉండే ఉద్యోగులు తక్కువగా ఉండనున్నారు. ఎక్కువ మంది లక్ష డాలర్లలోపు ఉన్న వాళ్లనే ఇప్పటిదాకా కంపెనీలు అమెరికాకు రీలొకేట్ చేసుకునేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది.
ఎఫ్1 వీసా మీద అమెరికాకు మాస్టర్స్ చదువుకునేందుకు వచ్చే స్టూడెంట్లకు.. ఆ తర్వాత హెచ్1బీ వీసా ద్వారా ఉద్యోగం చేసుకునేందుకు ఆప్ట్ (ఓపీటీ– ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రోగ్రామ్ ఉండేది. కానీ, ఇప్పుడు కొత్త బిల్లు ద్వారా ఆప్ట్ ప్రోగ్రామ్‌ను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఈ నిర్ణయం నష్టం చేసేదే. అంటే చదువు పూర్తవ్వగానే అమెరికా నుంచి తిరిగి వచ్చేయడమో లేదంటే.. పై చదువులకు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక, హెచ్1బీ వీసాల నుంచి గ్రీన్‌కార్డులుగా మార్చుకునే ఆప్షన్‌నూ ఎత్తేయనున్నది. ఇప్పటికే హెచ్1బీ వీసా ఉన్న వ్యక్తుల భార్య లేదా భర్త (డిపెండెంట్) జాబ్ చేసే హెచ్4 వీసాలనూ రద్దు చేయనున్నది.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతున్నది. నిరుడు ఫిబ్రవరిలో 3,78,787 మంది విద్యార్థులు ఎఫ్1 వీసాకు దరఖాస్తు చేసుకుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ సంఖ్య 3.52 లక్షలకు పడిపోయింది. అంటే 26 వేలకుపైగా దరఖాస్తులు తగ్గాయి. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది అప్లికేషన్ల సంఖ్య 7 శాతం తగ్గింది. ఇక, అప్లికేషన్లు పెట్టుకున్నా.. అప్రూవ్ అవుతున్న వాటి సంఖ్య కూడా తక్కువగానే ఉంటున్నది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్రూవల్ రేట్ 37 శాతం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
తొలి ప్రాధాన్యం అక్కడికే..
అమెరికా విధిస్తున్న కఠినమైన షరతులతో చాలామంది ఇండియన్లు తొలి ప్రాధాన్యంగా కెనడావైపు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు. ఆ దేశంలో సరళతరమైన ఇమిగ్రేషన్ నిబంధనలుండడం, త్వరగా శాశ్వత నివాస హోదా వస్తుండడంతో కెనడాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ తర్వాత జర్మనీ కూడా ఇండియన్స్‌కు మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నది. దానికి కారణం.. ఎక్కువ మంది ఇండియన్లను ఆకర్షించేలా జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ (చాన్సెన్కార్ట్)ను తీసుకొచ్చింది.
దాని ద్వారా ఒక సంవత్సరంపాటు స్కిల్డ్ ఇండియన్ వర్కర్లు అక్కడ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దానిని పొడిగించుకునేందుకు చాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇండియన్లు చూస్తున్న మరో దేశం యూఏఈ. అక్కడ నైపుణ్యం కలిగిన వారికి ఆ దేశం ఐదేండ్ల గ్రీన్ వీసాను అందిస్తున్నది. అంతేకాదు.. అక్కడ సంపాదనపై ట్యాక్స్‌లు కూడా రద్దు చేసింది. దీంతో చాలా మంది ఆ దేశంవైవపు మొగ్గు చూపుతున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఫ్రాన్స్, సింగపూర్, సౌత్‌కొరియా, లండన్‌లాంటి దేశాలవైపు కూడా ఇండియన్స్ చూస్తున్నారు. స్కిల్డ్ వర్కర్ల కోసం ఆయా దేశాలు ప్రత్యేకమైన వీసాలను జారీ చేస్తున్నాయి. అంతేకాదు.. అసలు అమెరికాలో ఉంటున్న చాలా మంది ఇండియన్లు స్వదేశానికి వచ్చి ఇక్కడే ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టాలనీ యోచిస్తున్నట్టు ఇమిగ్రేషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
