మకరందాల మాధుర్యాల ఊట...
పసిడి పలుకుల పారవశ్వపు పాట..
తరతరాల చైతన్యాన్ని నడిపిస్తున్న బాట..
మదిలో పెనవేసుకున్న జానపదాల ఊట..
అదే.. అదేనోయ్ అచ్చమైన మన తెలుగు తోట..
ఈ కవిత మన మాతృభాషలో ఉన్న మాధుర్యాన్ని తెలియజేస్తుంది. మేటి కవులు రాసిన ఎన్నో కవితలు చదివాం. వాటిలోని భావాన్ని అర్థం చేసుకుని.. కొన్నిసార్లు జీవితాలకు అన్వయించుకున్నాం. అలనాటి కవులు ఎందరినో ఈనాటికీ గుర్తుచేసుకుంటున్నామంటే కవిత ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందుకే ఎన్ని తరాలైనా నెమరేసుకునే కవితల పరంపరను కొనసాగించాలనే ఉద్దేశంతో బాల్యం నుంచే పునాదులు వేస్తున్నాడు ఓ మాస్టారు. అసలు మాతృభాషను సరిగా మాట్లాడటం రాని తరం నడుస్తున్న ఈ రోజుల్లో కవితలా? ఎవరు చదువుతారు? అనిపిస్తుంది. కానీ మాతృభాషపై మమకారంతో నేటి తరాలకు ఆ మాధుర్యాన్ని పంచాలనే మాస్టారు సంకల్పం ముందు ఈ ప్రశ్నలు కనిపించవు.
ప్రస్తుతం స్టూడెంట్స్ తెలుగుపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ప్రైవేటు స్కూల్స్‌లోనే కాదు, సర్కారు బడుల్లోనూ చాలామంది విద్యార్థులు పరీక్షల్లో మార్కుల కోసం మాత్రమే మాతృభాషను చదువుతున్న పరిస్థితి కనపడుతోంది. కాగా మెదక్ జిల్లా కొల్చారం మండలం, రంగంపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మాత్రం మిగతా స్కూల్స్ కంటే ప్రత్యేకం. ఆ స్పెషాలిటీ ఏంటంటే పిల్లలంతా మాతృభాషపై మక్కువ చూపడం. వాళ్లకు తెలుగుపై అంత ప్రేమ కలగడానికి కారణం వాళ్ల టీచర్.
ఆ స్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న నర్సింగోజి నరేశ్ చారి.. విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తి పెంచేందుకు విశేష కృషి చేస్తున్నాడు. 2018లో ఈ పాఠశాలకు వచ్చిన నరేశ్ చారి మొదట విద్యార్థులు తెలుగు చదవడం, రాయడంపై దృష్టిసారించాడు. ఆ తర్వాత చదవడం, రాయడంపై పూర్తి పట్టు సాధించిన విద్యార్థులకు కవిత్వం, కథలు ఎలా రాయాలో చెప్పాడు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘గీతాంజలి’ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ప్రముఖ కవి, రచయిత సి. నారాయణ రెడ్డి (సి.నా.రే) ‘విశ్వంభర’ చదివించడంతోపాటు, ప్రముఖ కవులు నందిని సిధారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితా సంపుటాలను పరిచయం చేశాడు. వారు రాసిన కవితలను చదివి, వినిపించి అందులోని భావాలను అర్థమయ్యేలా వివరించేవాడు. అంతేకాదు తెలుగు పద్యాలు నేర్చుకుని, భావ, రాగ యుక్తంగా పాడటం నేర్పించాడు. అలా విద్యార్థుల్లో తెలుగు భాషపై మమకారాన్ని, కవితా రచనపై ఆసక్తిని పెంచాడు.
కవిత ఎలా మొదలు పెట్టాలి? ఎలా రాయాలి? కవితా వస్తువులను ఎలా ఎంచుకోవాలో.. ప్రతీది నేర్పించాడు. కవితలు రాయడంలో స్టూడెంట్స్‌కి వచ్చే డౌట్స్‌ను ఎప్పటికప్పుడు తీర్చేవాడు. ఫలితంగా కొద్దికాలంలోనే విద్యార్థులు కవితలు రాయడం నేర్చుకున్నారు. పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం తదితర సందర్భాల్లో జరిగే ప్రోగ్రామ్స్‌లో స్టూడెంట్స్‌తో వారు రాసిన కవితలను చదివించాడు. ప్రకృతి, సమాజం, ఊరు, బడి, గుడి, అడవి, చెట్లు, గుట్టలు, చెరువు, చేను, ఎండ, చలి, వర్షం, బాల్యం, అమ్మానాన్నలు, అన్నాచెల్లెలు, గురువులు, రైతులు, ముసలివాళ్లు, చందమామ, సైకిల్, స్నేహం, పువ్వులు, డ్రగ్స్... ఇలా కవితలు రాసేందుకు విద్యార్థులు స్పృశించని అంశం లేదు. కవితా రచనపై విద్యార్థులు పూర్తి పట్టు సాధించారనే నమ్మకం కుదిరాక నరేశ్ చారికి రెండేళ్ల కిందట వారు రాసిన కవితలతో ఒక సంకలనం తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. ఆ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. ఉపెందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన ప్రోత్సాహం, సహోపాధ్యాయురాలు ఎల్. విజయ నిర్మల ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత 6 నుంచి10వ తరగతి వరకు చదివే 78 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
సమాజ రుగ్మతలు, గురువుల గొప్పదనం, తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, అనుబంధాలు, రైతు వ్యథలు, ప్రకృతి అందాలు ఇలా అనేక అంశాలపై రాసిన146 కవితలతో పాటు నలుగురు ఉపాధ్యాయులు రాసిన 4 కవితలతో కలిపి మొత్తం150 కవితలతో ‘వెలుగు రేఖలు’ బడిపిల్లల కవిత్వం అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఇటీవలే జిల్లా విద్యాశాఖాధికారిణి విజయ చేతుల మీదుగా ఈ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ఇలా చాలామంది విద్యార్థులు బాల కవులుగా ఎదిగేలా ప్రోత్సహించాడు నరేశ్ చారి.
- తిమ్మన్నగారి శ్రీధర్, మెదక్
తెలంగాణ గొప్పదనాన్ని.. ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని.. సంస్కృతి, సంప్రదాయాలను తెలియచెబుతూ10 వ తరగతి విద్యార్థిని కుమ్మరి అక్షయ రాసిన ‘ఔ... మేం తెలంగాణోళ్లం’ అద్భతంగా ఉంది.
ఔ మేం తెలంగాణోళ్లం
మాకు భాష అంటే అభిమానం
యాస అంటే ప్రాణం
మా ప్రాణం ఉన్నదే గీ యాసల
మాకు గుర్తింపునిచ్చిందే గీ యాస
మా యాసే గాదు
మా జీవనం కూడా జర ఏరుగానే ఉంటది
అంతా రక్త సంబంధాలలెక్కుంటం
అందరం ఒకరికొకరం అయినోళ్లమే
చుట్టరికం తోటి మెదిలెటోళ్లం గానీ
రాజరికం సూపెటోళ్లం గాదు
మమ్ములను నమ్మినోళ్లకు
ఆపదొస్తే ఆదుకునేటోళ్లం గాని
ఆగం చేసేటోళ్లం కాదు
నట్టేట్ల ముంచెటోళ్లం అసలే కాదు
మా ఆచారాలు అంటరా
బాగా పసందుగుంటాయి
నువ్వు పుట్టిననుంచి పోయేదాక
నిన్ను మోస్తుంది ఈ నేలమ్మే కదా!
మరి ఏనాడైనా
ఎవరైనాదండం పెడ్తరా?
మేం పెడ్తం
నువ్వు బతకడానికి గాలిని ఇచ్చేటికి చెట్లు కదా!
మరి ఏనాడైనా వాటిని యాదిజేసుకున్నావా
మేము ముడుపులు కట్టి పూజలు చేస్తాం
యాడన్నా సూశిర్రా గీ ఇసిత్రం
మేం పువ్వులను కూడా పూజిస్తాం
రాళ్లలో దేవుళ్లను సూసేటోళ్లం బోనం జేసేటోళ్లం
ఇగ మనుషుల్లో జూడమా
గిట్ల జెప్పాలంట బాగనే ఉన్నయి
కవులే లేరు మీ గడ్డమీద అని అన్నోడి
ముక్కు మీద వేలు పడేటల్లు
అబ్బురపరిచే కవులకు
పురుడు పోసుకుంది మా తెలంగాణా
కన్న తల్లులసోంటి
ప్రకృతిని పూజించేటోళ్లమే గాని
పాడుచేసేటోళ్లం గాదు
ఎందుకంటే మేం తెలంగాణోళ్లం
మేం గిట్లనే ఉంటం
10వ తరగతి విద్యార్థి అంజు కుమార్ రాసిన ‘అమ్మో సలి’ కవిత చదువుతుంటే గిలిగింతలు పెడుతుంది.
ఈ సలి సల్లగుండ
నేను పక్కల నుంచి లేవక ముందే
నా పక్కలోకి వచ్చి వణికిస్తుంది
డబ్బాలో వేసి మూతపెట్టినట్లు
ఇంట్లోకెళ్లి ఎవరినీ బయటకు రానిస్తలేదు
ఒకప్పుడు గురువులు ఉత్తమాటగానే
తోలు పగులుతుంది అనే వారు
కానీ ఈ సలి నిజంగానే తోలు పగులగొడుతుంది
గీ సలి అందరిని పక్షవాతం వచ్చినట్టు వణికించినా
అందరిని సమానంగానే చూస్తది
- తిమ్మన్నగారి శ్రీధర్, మెదక్
Note: లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
