హనుమకొండ కలెక్టర్ కు ఆరు బాధ్యతలు

హనుమకొండ కలెక్టర్ కు ఆరు బాధ్యతలు
  •     ఆరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్ చాహత్ బాజ్​పాయ్
  •     జీడబ్ల్యూఎంసీ కమిషనర్, కుడా వైస్ చైర్మన్​గా అడిషనల్ చార్జ్   
  •  జడ్పీ, డీసీసీబీ స్పెషల్ ఆఫీసర్​గా విధులు
  •     తాజాగా జీడబ్ల్యూఎంసీ స్పెషల్  ఆఫీసర్​గా అదనపు బాధ్యతలు
  •     తీవ్ర ఒత్తిడిలోనూ తనదైన మార్క్  చూపిస్తున్న కలెక్టర్

హనుమకొండ, వెలుగు: హనుమకొండ కలెక్టర్  చాహత్  బాజ్ పాయ్ పై బాధ్యతల బరువు పెరిగిపోయింది. హనుమకొండ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు నిన్నటి వరకు నాలుగు అదనపు బాధ్యతలు ఉండగా, గురువారం మరో బాధ్యత వచ్చిపడింది. గ్రేటర్  వరంగల్  మున్సిపల్  కార్పొరేషన్  పాలకవర్గ పదవీకాలం బుధవారం ముగియడంతో గురువారం ఆమె జీడబ్ల్యూఎంసీ స్పెషల్  ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నారు. కలెక్టర్  డ్యూటీతో పాటు మరో ఐదు అదనపు బాధ్యతలతో తీవ్ర ఒత్తిడి ఉంటున్నా.. తనదైన శైలి చాటుతుండడం విశేషం.

ఒక్క ఐఏఎస్ కు ఆరు బాధ్యతలు..

చాహత్  బాజ్ పాయ్  2019 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్  ఆఫీసర్. అంతకుముందు ఉట్నూర్‌‌‌‌  ఐటీడీఏ పీవోగా, అసిఫాబాద్‌‌‌‌  అడిషనల్  కలెక్టర్‌‌‌‌గా, కరీంనగర్  మున్సిపల్  కమిషనర్ గా పని చేసిన ఆమె 2025 జూన్ లో గ్రేటర్  వరంగల్  మున్సిపల్  కార్పొరేషన్  కమిషనర్ గా బదిలీపై వచ్చారు. అక్కడ ఏడు నెలలు పని చేసిన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాష్ట్ర ప్రభుత్వం హనుమకొండ కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి జీడబ్ల్యూఎంసీకి కొత్త కమిషనర్ ను నియమించకపోవడంతో ఆ బాధ్యతలనూ చూసుకుంటున్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనరే కాకతీయ అర్బన్  డెవలప్​మెంట్  అథారిటీ వైస్  చైర్మన్ గానూ విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఇదిలాఉంటే జడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తవడంతో, హనుమకొండ జడ్పీ స్పెషల్  ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నారు. వరంగల్  జిల్లా కేంద్ర సహకార బ్యాంక్  పాలకవర్గ గడువు కూడా ముగియడంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి డీసీసీబీ పర్సన్  ఇన్ చార్జిగా ఆమెనే విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం గ్రేటర్  వరంగల్  పాలకవర్గం గడువు పూర్తవడంతో గురువారం జీడబ్ల్యూఎంసీ స్పెషల్  ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో హనుమకొండ జిల్లాలో ఒక్క ఐఏఎస్  ఆఫీసర్ ఆరు బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

భారమైనా తనదైన మార్క్..

ఆరు బాధ్యతలు మోస్తున్న హనుమకొండ కలెక్టర్ చాహత్  బాజ్ పాయ్ పై పాలనాపరంగా భారం పడుతోంది. ఆరుగురు చేయాల్సిన పనిని ఒక్క ఆఫీసరే చేయాల్సి వస్తుండడంతో కలెక్టర్ పై అడ్మినిస్ట్రేషన్  పరంగా భారం ఎక్కువవుతోంది. వాస్తవానికి హనుమకొండ జిల్లాతో పాటు గ్రేటర్  వరంగల్ బాధ్యతలు చూసుకోవడం కత్తి మీద సాము లాంటిదే. కానీ, గ్రేటర్ కు ప్రభుత్వం రెగ్యులర్  కమిషనర్ ను నియమించకపోవడంతో అక్కడి వ్యవస్థను కూడా కలెక్టరే చక్కదిద్దాల్సి వస్తోంది. ఇంత ఒత్తిడిలోనూ తన దైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం, మక్కలు కొనుగోలుపై దృష్టి పెట్టగా, జిల్లాలో అభివృద్ధి పనుల కొనసాగింపు, జీడబ్ల్యూఎంసీలో పాలనపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతూ ఆఫీసర్లతో రివ్యూలు చేస్తున్నారు. కలెక్టర్​పై గ్రేటర్  భారం పడుతుండడంతో జీడబ్ల్యూఎంసీకి రెగ్యులర్  కమిషనర్ ను నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో కొత్త కమిషనర్  రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త కమిషనర్  వస్తే హనుమకొండ కలెక్టర్ పై భారం తగ్గడంతో పాటు మరింత మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

  • స్పెషల్ ఆఫీసర్‍గా బాధ్యతల స్వీకరణ

వరంగల్‍/వరంగల్‍ సిటీ: గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ స్పెషల్‍ ఆఫీసర్‍గా హనుమకొండ కలెక్టర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. మేయర్‍ గుండు సుధారాణి అధ్యక్షతన ఏర్పాటైన పాలకవర్గం గడువు ముగియడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిగా వచ్చారు. 

బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు స్పీడప్​ చేయాలని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. టౌన్‍ ప్లానింగ్‍ విభాగంలో ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. నగరంలో అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణానికి ఫైనల్​ డీపీఆర్‍కు అవసరమైన సూచనలు చేయాలన్నారు. బయో సీఎన్‍జీ ఏర్పాటుకు నోటిఫికేషన్‍ ఇవ్వాలని ఆదేశించారు. టాక్స్  కలెక్షన్‍ నిర్వహణను క్రమబద్ధీకరించాలన్నారు. అడిషనల్‍ కమిషనర్‍ చంద్రశేఖర్‍, సీఎంహెచ్‍వో డాక్టర్‍ రాజారెడ్డి, ఇన్​చార్జి సిటీ ప్లానర్‍ రవీందర్‍ రాడేకర్‍, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, ఏఏహెచ్‍వో డాక్టర్‍ రాజేశ్‍ పాల్గొన్నారు.