వెలుగు ఓపెన్ పేజీ : భారత అజేయ స్ఫూర్తి... సోమనాథ్

వెలుగు ఓపెన్ పేజీ : భారత అజేయ స్ఫూర్తి... సోమనాథ్

సోమనాథ్ ఆలయంపై  మొదటి దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన నేపథ్యంలో  ‘సోమనాథ్  స్వాభిమాన పర్వ్’ను  పురస్కరించుకుని 2026  ప్రారంభంలో  నేనక్కడికి  వెళ్లాను.  ఇప్పుడు మరోసారి సోమనాథ్‌‌ను దర్శించుకోబోతున్నాను.   పునర్నిర్మించిన  సోమనాథ్ ఆలయాన్ని అప్పటి  రాష్ట్రపతి  డాక్టర్  రాజేంద్రప్రసాద్ ప్రారంభించి 75 వసంతాలు నిండిన సందర్భంగా నేడు మే 11న ఆ పావన క్షేత్రానికి వెళ్తున్నాను. ఆరు నెలలలోపే సోమనాథ క్షేత్రానికి సంబంధించి రెండు మహత్తర ఘట్టాల్లో పాల్గొనడం,  విధ్వంసం నుంచి సృజన దిశగా సోమనాథ్  మహోజ్వల  ప్రస్థానంలో భాగస్వామినవడం నిజంగా నా అదృష్టం.  నాగరికతకు సంబంధించి సోమనాథ్  మనకు  ఒక  సందేశాన్ని అందిస్తోంది.  ఆలయం ముందున్న విశాల సముద్రం అమరత్వాన్ని ఆవిష్కరిస్తోంది.  తుఫానులెంత భీకరంగా ఉన్నా,  అలలు కల్లోలం చేసినా.. ఆత్మగౌరవంతో, శక్తితో పునరుత్తేజాన్ని పొందగలమని సముద్రుని  అలలు మనకు చెబుతున్నాయి.  ప్రజా చేతనను  ఎంతోకాలం అణచిపెట్టలేమని ప్రతి తరానికీ ఈ సాగరం చెబుతున్నట్లుగా అలలు తిరిగి తీరాన్ని చేరుతున్నాయి. 

మన ప్రాచీన గ్రంథాలిలా చెబుతున్నాయి - ‘ప్రభాసం చ పరిక్రమ్య పృథివీక్రమసంభవమ్’. అంటే దివ్యమైన ప్రభాస క్షేత్రం (సోమనాథ్)లో  ఒకసారి  ప్రదక్షిణ చేస్తే, ఈ భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే!  ప్రార్థనల కోసం ఇక్కడికొచ్చే భక్తులు.. శాశ్వతమై,  దేదీప్యమై వెలుగొందుతున్న ఈ అద్భుతమైన నాగరికతా ప్రవాహాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు.  ఎన్నో రాజ్యాలు వచ్చాయి. అంతరించిపోయాయి. కాలం మారింది.  విజయాలు, వినాశనాల మధ్య నుంచి చరిత్ర సాగిపోయింది. అయినా సోమనాథ్ మన చేతనలో అచంచలంగా నిలిచే ఉంది.  నిరంకుశత్వాన్ని  ఎదిరించి  దృఢంగా  నిలిచిన  మహనీయులనెందరినో  స్మరించుకోవాల్సిన తరుణమిది.  లకులిస, సోమశర్మ ఈ ప్రభాస క్షేత్రాన్ని గొప్ప తాత్విక కేంద్రంగా నిలిపారు.  వల్లభి చక్రవర్తి  మహారాజ  నాలుగో ధారసేనుడు శతాబ్దాల కిందటే ఇక్కడ రెండో ఆలయాన్ని నిర్మించాడు.  దండయాత్రలకు ఎదురొడ్డి మన నాగరికతా గౌరవాన్ని నిలబెట్టిన  భీమదేవుడు, జయపాలుడు, ఆనందపాలుడు సదా స్మరణీయులు.  భోజరాజు కూడా పునర్నిర్మాణానికి సాయం చేశాడని చెబుతారు.  గుజరాత్  రాజకీయ,  సాంస్కృతిక శక్తిని పునరుద్ధరించడంలో కర్ణదేవుడు, సిద్ధరాజ జయసింహుడు కీలక పాత్ర పోషించారు.  భావ బృహస్పతి, కుమారపాల సోలంకి, పాశుపతాచార్యులు ఈ మందిరాన్ని పునర్నిర్మించి.. ఒక గొప్ప ఆరాధన, విద్యాకేంద్రంగా నిలిపారు. విశాలదేవ వాఘేలా, త్రిపురాంతకుడు ఇక్కడి ఆధ్యాత్మిక,  మేధో  పరంపరను రక్షించారు. ఆలయ విధ్వంసం తర్వాత తిరిగి పూజలు మొదలుపెట్టి మహీపాలదేవుడు, రా ఖంగార్ కీలకంగా నిలిచారు.  ప్రస్తుతం  300వ  జయంత్యుత్సవాలు జరుగుతున్న పుణ్యశ్లోక అహల్యాబాయి  హోల్కర్  అత్యంత  క్లిష్ట సమయాల్లోనూ  నిరంతరం  ఆరాధన  కొనసాగేలా చూసి, సోమనాథుని పట్ల భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.

  
సర్దార్  పటేల్  పిలుపుతో.. 

యాత్రికుల హక్కులను కాపాడడంలో బరోడా  గైక్వాడ్‌‌లు విశేష కృషి చేశారు. ఎంతోమంది వీరులను కన్న ఈ పుణ్యభూమిలో వీర హమీర్జీ గోహిల్, వీర వేగ్దాజీ భిల్ వంటి సాహసమూర్తుల త్యాగం, ధైర్యసాహసాలు.. సోమనాథుడికి సంబంధించి చెరగని జ్ఞాపకాలు. దేశమంతటా స్వాతంత్ర్య కాంక్ష వెల్లువెత్తుతున్న 1940వ దశకంలో, సర్దార్ పటేల్ వంటి మహోన్నత నాయకుల సారథ్యంలో నవభారత గణతంత్రానికి పునాదులు పడుతున్న వేళ.. ఒక విషయం ఆయనను నిరంతరం కలచివేసింది. అదే సోమనాథ్ ఆలయ స్థితి. అది 1947 నవంబర్ 13. ఆ రోజు దీపావళి. శిథిలావస్థలో ఉన్న ఆ ఆలయ ప్రాంగణంలో నిలబడి, సముద్ర జలాలను చేతిలోకి తీసుకుని ఆయన ఇలా ప్రకటించారు - ‘సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాలని ఈ (గుజరాతీ) నూతన సంవత్సర శుభవేళ మేం సంకల్పించాం. సౌరాష్ట్ర వాసులారా.. ఇందుకోసం మీరు శక్తివంచన లేకుండా కృషిచేయాలి. అందరూ భాగస్వాములు కావాల్సిన పవిత్ర యజ్ఞమిది.’  సర్దార్  పటేల్  పిలుపుతో  గుజరాత్  ప్రజలే కాదు, యావద్భారతమూ ఎంతో ఉత్సాహంగా స్పందించింది.   విధివశాత్తూ  తానెంతగానో     తపించిన    ఆ కల   సాకారమవడాన్ని   పటేల్​ వీక్షించలేకపోయారు. 

గుజరాత్​ సీఎంగా  ప్రత్యేక కార్యక్రమం 

పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు ఇంకా భక్తుల కోసం తెరుచుకోకముందే సర్దార్ పటేల్ ఈ లోకాన్ని వీడారు.  అయినప్పటికీ, ఆ ప్రభాస పట్టణ  పవిత్ర తీరంలో ఆయన స్ఫూర్తి  సజీవంగా నిలిచే ఉంది.  ఆయన ఆశయాన్ని  కె.ఎం. మున్షీ  ముందుకు తీసుకెళ్లగా..  నవానగర్  జామ్‌‌సాహెబ్ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు.  1951లో  ఆలయ  నిర్మాణం  పూర్తయ్యాక  ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌‌ను ఆహ్వానించాలని  నిర్ణయించారు. నాటి  ప్రధానమంత్రి పండిత్  నెహ్రూ ఎంత వ్యతిరేకించినా,  వాటన్నింటినీ అధిగమించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ వేడుకకు విచ్చేయడంతో ఆ ఘట్టం మరింత ప్రత్యేకంగా, చరిత్రాత్మకంగా నిలిచింది.  ముఖ్యమంత్రిగా  నేను బాధ్యతలు స్వీకరించిన 2001 అక్టోబర్ నెల నాకు గుర్తొస్తోంది.  సోమనాథ్ ఆలయం తలుపులు తెరుచుకొని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం గుజరాత్  ప్రభుత్వానికి వచ్చింది.  అదే రోజు అంటే, 2001 అక్టోబర్ 31 సర్దార్ పటేల్125వ జయంత్యుత్సవాలను నిర్వహించడం యాదృచ్ఛికం.  అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి, హోం మంత్రి  ఎల్‌‌కే అద్వానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

‘ఏక్ భారత్,  శ్రేష్ఠ భారత్’ 

తిరుగులేని విశ్వాసం, ప్రేమతో కూడిన దేనినైనా నాశనం చేయలేమని సోమనాథ్ ఆలయం ప్రపంచానికి చాటిచెబుతోందని 1951 మే 11న చేసిన  ప్రసంగంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రజల హృదయాల్లో ఈ దేవాలయం చిరస్థాయిగా నిలిచిపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆలయ పునరుద్ధరణతో సర్దార్ పటేల్ కల నెరవేరిందనీ, అయితే ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి ప్రజల జీవితాల్లో సంక్షేమాన్ని పునరుద్ధరించడం అత్యంత ముఖ్యమైనదనీ ఆయన చెప్పారు. ఇవన్నీ ఆయన అందించిన ముఖ్యమైన, స్ఫూర్తిదాయకమైన సందేశాలు. దశాబ్ద కాలానికి పైగా మేం నడుస్తున్న మార్గమిదే. ‘వికాస్ భీ, విరాసత్ భీ’ అనే సూత్రం నుంచి స్ఫూర్తి పొంది సోమనాథ్ నుంచి కాశీ వరకు,  కామాఖ్య నుంచి కేదార్‌‌నాథ్ వరకు, అయోధ్య నుంచి ఉజ్జయిని వరకు, త్రయంబకేశ్వర్ నుంచి శ్రీశైలం వరకు మన ఆధ్యాత్మిక కేంద్రాల సంప్రదాయ స్వరూపాన్ని కాపాడుతూనే.. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దే అవకాశం మా బృందానికి లభించడం అదృష్టంగా భావిస్తున్నాను.  వీటితోపాటుగా రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరచడం వల్ల మరింత మంది వీటిని దర్శించుకుంటారు.  ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.  జీవనోపాధికి భరోసాను అందిస్తుంది. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది.  సోమనాథ్‌‌ను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన వారి పోరాటాలను, త్యాగాలను ఎన్నటికీ మరచిపోకూడదు. అలాగే, ఈ ఆలయాన్ని అనేకమార్లు పునర్నిర్మించిన వారిని సైతం స్మరించుకోవాలి. 

సోమనాథ్ ఆలయాన్ని సందర్శించండి

సోమనాథ్​ ఆలయ వైభవాన్ని పునరుద్ధరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది తోడ్పాటు అందించారు.  వారు భారతదేశంలోని  ప్రతి భాగాన్ని  పవిత్రమైనదిగా, భౌగోళిక హద్దులకు అతీతంగా వారంతా ఏకత్వ భావనతో ఉన్నారు.  విభజనలతో నిండిన ఈ ప్రపంచంలో మునుపెన్నడూ లేనివిధంగా ఐక్యతా స్ఫూర్తి అవసరం ఏర్పడింది.  ప్రతి భారతీయుని మదిలో ఐక్యతా భావం, ఉమ్మడి నాగరికతా చైతన్యం ఉండడం వల్లనే సోమనాథ్ విజయ గర్వంతో  నిలిచింది.  దీనిని గౌరవిస్తూ... వెయ్యేళ్ల  అసాధారణ ధైర్యాన్ని స్మరించుకుంటూ.. రాబోయే వెయ్యి రోజులపాటు సోమనాథ్‌‌లో  ప్రత్యేక  పూజలు జరుగుతాయి.  ఈ పూజలకు సైతం అనేకమంది విరాళాలివ్వడం ఆనందాన్నిస్తోంది. ఈ ప్రత్యేక సందర్భంలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా నా తోటి భారతీయులను కోరుతున్నాను.  సోమనాథ్  తీరంలో నిలబడినప్పుడు, ఆ ప్రాచీనతను మీలో నింపుకుంటారు. మీరు భక్తి పారవశ్యంలో మునిగిపోవడమే కాదు.. చెదిరిపోవడానికి అంగీకరించని, అఖండ నాగరికత మీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అజేయమైన భారతదేశపు స్ఫూర్తి తొణికిసలాడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మన సంస్కృతికి ఎలా అజేయంగా  నిలిచిందో  తెలుసుకుంటారు. శాశ్వతమైన విజయాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది. అదొక చిరస్మరణీయ అనుభవంగా మీ మదిలో మిగిలిపోతుంది. జై సోమనాథ్.

(నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి, 
శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్)

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.