- జగిత్యాలలో ఆందోళన
- ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలని డిమాండ్
ఆదిలాబాద్/సిరికొండ/నిజామాబాద్/నిర్మల్/లక్సెట్టిపేట/జగిత్యాల టౌన్/కోరుట్ల, వెలుగు: వెలుగు: ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్జిల్లాలో పలు చోట్ల గురువారం ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన పంట మొత్తం తడిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అరగంట పాటు వర్షం దంచికొట్టింది. దీంతో మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన జొన్న, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి. వరదకు పంట కొట్టుకుపోయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ భారీ ఈదుగుగాలుకు ఎగిరిపోయాయి. తూకం వేసి బస్తాల్లో ఉన్న ధాన్యం సైతం తడిసిపోయింది.
40 నిమిషాల వర్షం
నిజామాబాద్జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, జక్రాన్పల్లి, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్, ఆలూరు మండలాల్లో మధ్యహ్నం ఈదురు గాలులతో వర్షం పడింది. 40 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో కరెంట్స్తంభాలు నేలకొరిగి, వైర్లు తెగిపోయి విద్యుత్ సప్లైలో అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. సిరికొండ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కల్లాల్లోకి భారీగా వరద చేరడంతో మోటర్పంపుతో నీటిని ఎత్తిపోశారు. ధాన్యం కొనుగోలు జాప్యం జరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తాటిపల్లి గ్రామంలో మూడు చోట్ల 11 కేవీ లైన్ తెగిపడగా కరెంట్సప్లయ్ఆపేశారు. నిర్మల్ జిల్లాలోనూ పలు చోట్ల గాలిదుమారంతో కూడిన వర్షం పడింది. ఫలితంగా పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. నర్సాపూర్(జి) మండలంలోని పలు గ్రామాలు, ముథోల్, లోకేశ్వరంలో పంటలకు భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
లక్సెట్టిపేటలో మరోసారి
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. చాలా సెంటర్లలో టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యం చుట్టూ నీరు చేరింది. మంగళవారం ఈదురు గాలులు మిగిల్చిన భారీ నష్టాన్ని మరవకముందే మరోసారి బెంబేలెత్తించింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అధికారులు సైతం పంటను కాపాడుకునేందుకు తమకు ఎలాంటి సదుపాయం కల్పించలేదని ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు.
తడిసిన ధాన్యం.. రైతుల రాస్తారోకో
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి, మక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. కళ్లముందే పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జాప్యం వల్లే తమ వడ్లు తడిశాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ఎదుట రోడ్డుపై ధర్నాకు దిగారు. కోరుట్ల, మెట్‌పల్లిలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం, కథలాపూర్ మండలంలో ఈదురుగాలులతో తేలికపాటి వర్షంకురిసింది. కోరుట్ల, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లలో వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దైంది. బయట ఆరబోసిన వడ్లు, మక్కలు పూర్తిగా తడిచిపోవడంతో నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరు
మున్నీరయ్యారు.
