వెలుగు ఓపెన్ పేజీ : తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న భాషా సంస్కృతి

వెలుగు ఓపెన్ పేజీ : తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న  భాషా సంస్కృతి

తెలంగాణ రాష్ట్రం అంటేనే  పోరాటాలకు గడ్డ.ఎన్నో  ఏళ్ల  నిరీక్షణ,  ఎంతోమంది బలిదానాలు, సుదీర్ఘమైన ఉద్యమాల ఫలితంగా సిద్ధించిన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అందరూ ఆశించారు.  కానీ,   ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన వేదికలు నేడు వ్యక్తిగత దూషణలకు, అసభ్య పదజాలానికి అడ్డాగా మారుతున్నాయి.  అసెంబ్లీలోకానీ,   బహిరంగ సభల్లో కానీ వారు మాట్లాడే ప్రతిమాట భావి తరాలకు దిశానిర్దేశం చేసేలా ఉండాలి. దురదృష్టవశాత్తు    పరస్పరం ఒకరినొకరు తిట్టుకోవడం,  హీనంగా మాట్లాడుకోవడం  సర్వసాధారణం అయిపోయింది.  అభివృద్ధి గురించి  చర్చించాల్సిన  సమయంలో,  ప్రత్యర్థి పార్టీ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్  చేయడం ఒక ఫ్యాషన్​గా  మారింది.  నిజానికి  విమర్శ  అనేది  ప్రజాస్వామ్యానికి  ప్రాణం.   ప్రభుత్వ వైఫల్యాలను  ఎత్తిచూపడం ప్రతిపక్షం బాధ్యత,  అలాగే అభివృద్ధిని వివరించడం ప్రభుత్వ బాధ్యత.   అయితే,  ఈ విమర్శలు రాజకీయపరమైన ఆరోపణలకే  పరిమితం కావాలి తప్ప,   వ్యక్తిగత  జీవితాలను రోడ్డు మీదకు లాగకూడదు.  ప్రెస్ మీట్లలో  నాయకులు వాడే  వ్యంగ్య,  ఘాటు వ్యాఖ్యలు వింటుంటే..  ‘మీరు తెలంగాణ సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా?’ 

అని  ప్రశ్నించాలనిపిస్తోంది.  మైక్​ముందు నోటికొచ్చినట్లు  మాట్లాడటం వల్ల నాయకుల  స్థాయి  పెరగదు.   అంతేకాకుండా  వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజం సిగ్గుతో  తలవంచుకోవాల్సి వస్తోంది.   సభల్లో అభివృద్ధి ప్రణాళికల గురించి చర్చించండి,  కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టండి,  నిర్మాణాత్మకమైన  సలహాలు ఇవ్వండి.  అంతేతప్ప,  తిట్ల  పురాణంతో ప్రజల సమయాన్ని,  వారి నమ్మకాన్ని వృథా చేయకండి.  రాజకీయాల్లో హుందాతనం అనేది  అలంకారం  కాదు,   అది ఒక బాధ్యత.  వ్యక్తిగత  దూషణలకు  స్వస్తి పలికి,  కేవలం అభివృద్ధి ప్రాతిపదికన రాజకీయాలు సాగాలని కోరుకుందాం.  మన నాయకులు మాటల యుద్ధం ఆపి, పనుల ప్రగతిపై దృష్టి పెట్టాలి.  అప్పుడే  తెలంగాణ  అమరవీరుల  త్యాగాలకు నిజమైన  గౌరవం దక్కుతుంది.  

- జక్కుల రాహుల్ యాదవ్
కాకతీయ యూనివర్సిటీ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.