తిరుమల కొండ కిటకిటలాడి పోతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ మరింత పెరిగింది. తిరుమలలో స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు 16-నుంచి18 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) కోసం కూడా భక్తులు భారీగా వేచి ఉండాల్సి వస్తోంది. ఈ దర్శనానికి సుమారు 3నుంచి 4 గంటల సమయం పడుతోంది. అలాగే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6గంటల నిరీక్షణ కొనసాగుతోంది.
ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్య తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతోంది. నిన్న ( 2026 మే 16 శనివారం) ఒక్కరోజే 90,011 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 39,083 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అన్ని ఏర్పాట్లు సమర్థంగా కొనసాగుతున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.
