నెల రోజులపాటు శ్రీవారి పుష్కరిని మూసివేత

నెల రోజులపాటు శ్రీవారి పుష్కరిని మూసివేత

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం దగ్గర ఉన్న పుష్కరిణిని  ఆగస్టు 01 2023 మంగళవారం నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలోని  నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని టీటీడీ తెలిపింది. ఇందులో భాగంగానే 2023 ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని వెల్లడించింది.  

ఈ సందర్భంగా నెల రోజులపాటు పుష్కరిణికి హార‌తి ఉండ‌దని టీటీడీ అధికారులు చెప్పారు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదని, పుష్కరిణిలోని నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవ‌స్థ అందుబాటులో ఉందని తెలిపారు. అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొల‌గించి మ‌ర‌మ్మతుల‌ను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత చివ‌రి ప‌ది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి..భక్తుల కోసం సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.

రెండుసార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలు

కాగా, తిరుమలలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు చాలాగొప్ప విశిష్టత ఉన్నదని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈసారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని చెప్పారు. 2023 సెప్టెంబర్‌ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, 2023 అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తామని వెల్లడించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2023 సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం ఉంటుందని తెలిపారు.

వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు

మరోవైపు స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే స్వయంగా వచ్చే ప్రముఖులకే బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు.