ఏపీ తీరప్రాంతంలో అరుదైన ఖనిజాలు

ఏపీ తీరప్రాంతంలో అరుదైన ఖనిజాలు

అమరావతి:  తన తీరప్రాంతాల్లో అరుదైన ఖనిజాల తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.  రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తీరప్రాంత జిల్లాల్లో భారీగా ఖనిజ నిక్షేపాలను గుర్తించింది. దేశంలోని బీచ్ శాండ్ ఖనిజ వనరులలో దాదాపు 25 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ వద్దే ఉంది.  ఇక్కడ ముఖ్యంగా టైటానియం డయాక్సైడ్, టైటానియం మెటల్, అరుదైన ఎర్త్ ప్రాసెసింగ్‌‌‌‌కు అవసరమైన ఇల్మెనైట్, రూటిల్, జిర్కాన్, మోనజైట్ నిక్షేపాలు ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రానిక్స్, రక్షణ వ్యవస్థల్లో ఉపయోగిస్తారు.

 ప్రస్తుతం గ్లోబల్ టైటానియం ఉత్పత్తిలో సగానికి పైగా, అరుదైన ఎర్త్ ప్రాసెసింగ్‌‌‌‌లో 90 శాతం వాటాను చైనా నియంత్రిస్తోంది. భారత్ తన టైటానియం డయాక్సైడ్ అవసరాల కోసం 75 శాతం కంటే ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో 10 ప్రధాన బీచ్ శాండ్ డిపాజిట్ల కోసం ఏపీఎండీసీ అనుమతులు పొందింది. 

వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ నిక్షేపాల్లో కోట్లాది టన్నుల భారీ ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా ఖనిజాలు వేరుచేయడం, శుద్ధి చేయడం, తయారీ వరకు పూర్తి స్థాయి వాల్యూ చైన్‌‌‌‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్రం భావిస్తోంది.