భూ నిర్వాసితులను ఆదుకోవాలి

భూ నిర్వాసితులను ఆదుకోవాలి
  • టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, కంపెనీల పేరిట సర్కార్​ చేపట్టిన అక్రమ భూసేకరణను ఆపాలని టీజేఎస్ చీఫ్  ప్రొఫెసర్​ కోదండరాం డిమాండ్​ చేశారు. రాచరిక ప్రభుత్వాన్ని నడిపిన నిజాం నవాబు.. భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే నిజాం సాగర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారని, కానీ మన ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిహారం ఇవ్వకముందే ప్రజలను బెదిరించి భూసేకరణ చేస్తోందని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలోని చర్లగూడెం, కృష్ణరాయిపల్లి భూనిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు ఆశప్ప ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో జరిగిన సమావేశంలో కోదండరాం మాట్లాడారు.

రాష్ట్రంలో ఫార్మా సిటీ కంపెనీల కోసం కొత్తగా భూసేకరణ చేయడం ఆపాలని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోవట్లేదని, ఆ మొత్తాన్ని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడులో ప్రజలు కేంద్రంగా కాకుండా..  రాజకీయ లొల్లి జరుగుతోందన్నారు. మునుగోడులో భూనిర్వాసితుల మీద, నేతన్నల సమస్యల మీద, ఫ్లోరైడ్ సమస్య మీద చర్చ జరగాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజల నుంచి భూముల్ని గుంజుకుని, పరిహారం ఇవ్వకుండా తిప్పించుకోవడం సరికాదని ప్రొఫెసర్ హరగోపాల్ ఫోన్​ ద్వారా తెలిపారు. సమావేశంలో ఫార్మాసిటీ, చర్లగూడెం, కృష్ణరాయిపల్లి భూ నిర్వాసితులు మాట్లాడారు.