పేరుకే మంత్రులు.. పెత్తనం కేటీఆర్​దే

పేరుకే మంత్రులు.. పెత్తనం కేటీఆర్​దే
  • టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టిన రాష్ట్ర మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఏ చిన్న సమస్యకైనా మంత్రి కేటీఆర్ చూపే పరిష్కారం కోసం ఎదురు చూడాల్సి వస్తోందన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. ‘లాక్ డౌన్​ మొదలయ్యాక జొమాటో, స్విగ్గీ  డెలీవరీ బాయ్స్‌‌ను పోలీసులు అడ్డుకుంటే హోంమంత్రి మహమూద్ అలీ ఈ విషయంలో క్లారిఫికేషన్ ఇస్తారని ఎదురుచూశాం.. కానీ పోలీసులకు కేటీఆర్ ఆదేశాలివ్వగానే డెలివరీ బాయ్స్ కు అనుమతినిచ్చారు. రోగులకు మందులు, వైద్యం అందకపోతే  ఆ శాఖను చూస్తున్న సీఎం కేసీఆర్, ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తారనుకుంటే.. ఆ శాఖలో కూడా కేటీఆర్ జోక్యం చేసుకుంటేనే పనులు అవుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ పనులు చూసుకోవాలి గానీ, ప్రతి వ్యవహారంలో ఆయన జోక్యం తగదు.. తమతో ఏ పని కాదని తెలిశాక వారి దగ్గరికి ఎవరు వస్తారని నాతో ఒకరిద్దరు మంత్రులు ఆవేదనతో చెప్పారు. గతంలో హోంమంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డిని కలసినప్పుడు ఇదే వాపోయారు. టోపీ మాత్రమే తన దగ్గరుంది.. లాఠీ లేదని చమత్కారంగా చెప్పారు..’ అని గుర్తు చేశారు.