- ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని కోదండరాం పిలుపు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, రాజకీయ ప్రక్షాళన కోసం ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని, స్థానికంగా ప్రజా సమస్యలపై గళమెత్తాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రధాన సమస్యలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు చేయాలన్నారు. వచ్చే నెలలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాలుగో రాష్ట్ర ప్లీనరీ హైదరాబాద్ లో నిర్వహించాలని రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ నిర్ణయించింది.
బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో టీజేఏస్ రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ సమావేశం పార్టీ చీఫ్ కోదండరాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎత్తివేసే సుప్రీంకోర్టు తీర్పును ప్రజల్లో ఎండగట్టాలని, దీని కోసం కలిసి వచ్చే శక్తులతో ఉద్యమించాలన్నారు. ఆర్టీసీ, సింగరేణి పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు. వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీలో నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్ధం కావాలన్నారు.
