V6 News

BJP Vs TMP : లోక్ సభలో ఈ సిగరెట్ దుమారం..

BJP Vs TMP : లోక్ సభలో ఈ సిగరెట్ దుమారం..

భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం (డిసెంబర్ 11) లోక్‌సభలో సంచలన ఆరోపణలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన ఒక ఎంపీ లోక్‌సభలోనే ఈ-సిగరెట్ (E-Cigarette) తాగుతున్నారని అన్నారు. 

లోక్‌సభలో మాట్లాడుతున్న  అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో ఈ-సిగరెట్లు నిషేధించబడ్డాయి. కానీ TMC పార్టీ ఎంపీ లోక్‌సభలోనే ఈ-సిగరెట్  తాగుతున్నారు. మీరు దీనికి అనుమతి ఇచ్చారా ? అని స్పీకర్ ఓం బిర్లాని ప్రశ్నించారు. దానికి స్పీకర్  స్పందిస్తూ, తాను అలాంటి అనుమతి ఇవ్వలేదని బదులిచ్చారు. అయితే, అనురాగ్ ఠాకూర్ ఆ టీఎంసీ ఎంపీ పేరును మాత్రం చెప్పలేదు.

నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ ఎంపీపై చర్య తీసుకోవాలని అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ స్పీకర్‌ను కోరగా... దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆ టీఎంసీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం: కేంద్ర ప్రభుత్వం 2019లో భారతదేశంలో ఈ-సిగరెట్ల అమ్మకాలు, ఉత్పత్తి, నిల్వపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ నిషేధం ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA), 2019 కింద అమలు చేసింది.  నిషేధం ఉన్న  ఈ సిగరెట్ల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఉల్లంఘనలను ప్రజలు తెలియజేసేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023లో ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది.

 ఈ ఏడాది ఆగస్టులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కుర్లా వెస్ట్‌లోని ఒక గోదాముపై దాడి చేసి సుమారు రూ. 25.50 లక్షల విలువైన నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఉబేద్ మొహమ్మద్ సలీం షేక్ (31) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా... ప్రభుత్వం నిషేధించిన ఈ-సిగరెట్లను పెద్ద మొత్తంలో అక్రమంగా నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేశారు. ఇప్పటికి నిషేధం అమలులో ఉన్న కూడా ఈ-సిగరెట్ల అక్రమ వ్యాపారం ఇంకా కొనసాగుతుందనే ఆందోళనను పెంచుతోంది.