మొయిత్రాపై బహిష్కరణ సిఫార్సుకు ఎథిక్స్ కమిటీ ఆమోదం

మొయిత్రాపై బహిష్కరణ సిఫార్సుకు ఎథిక్స్ కమిటీ ఆమోదం
  • మొయిత్రాపై బహిష్కరణ సిఫార్సుకు ఎథిక్స్ కమిటీ ఆమోదం
  • 6:4తో రిపోర్టుకు ఆమోదం తెలిపిన ప్యానెల్ సభ్యులు
  • స్పీకర్​కు రిపోర్టు పంపనున్న ప్యానెల్

న్యూఢిల్లీ/కోల్​కతా :  డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరించాలని లోక్ సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసినట్టు తెలిసింది. మహువాపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. అనంతరం రిపోర్టు తయారు చేసింది. దీనిపై గురువారం కమిటీ చీఫ్ వినోద్ సోంకర్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో చర్చ జరిగింది. అనంతరం 6:4తో రిపోర్టును కమిటీ ఆమోదించింది. ఇప్పుడీ రిపోర్టును తదుపరి చర్యల కోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించనుంది. ఎథిక్స్ కమిటీలోని అపరాజిత సారంగి, రాజ్ దీప్ రాయ్, సుమేదానంద్ సరస్వతి, ప్రణీత్ కౌర్, వినోద్ సోంకర్, హేమంత్ గాడ్సే రిపోర్టును సమర్థించగా.. డానీష్ అలీ, వి.వైతిలింగం, పీఆర్ నటరాజన్, గిరిధరి యాదవ్ వ్యతిరేకించారు. కాగా, మీటింగ్ అనంతరం వినోద్ సోంకర్ మీడియాతో మాట్లాడుతూ.. రిపోర్టును ఆరుగురు సభ్యులు సమర్థించగా, నలుగురు వ్యతిరేకించారని తెలిపారు. రిపోర్టును వ్యతిరేకించిన సభ్యులు మాట్లాడుతూ.. ఈ రిపోర్టు సరిగా లేదని, పక్షపాత ధోరణితో సిఫార్సులు చేశారని విమర్శించారు. 

స్పీకర్​కు మహువా లెటర్.. 

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మహువా మొయిత్రా గురువారం లెటర్ రాశారు. ఎథిక్స్ కమిటీ రిపోర్టు ముందే మీడియాకు లీకైందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లెటర్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘‘నేను ఇంతకుముందు చేసిన ఫిర్యాదులపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. అయినప్పటికీ ఈ విషయం మీ దృష్టికి తెస్తున్నాను” అని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా, మహువా చర్యలు అనైతికమైనవని, నేరపూరితమైనవని.. ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. 

రాజకీయాలకు మహువా బలైంది :  అభిషేక్ బెనర్జీ 

టీఎంసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ.. తమ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాకు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయాలకు మహువా బలైందని ఆయన ఆరోపించారు. నాలుగేండ్లుగా తనను కూడా కేంద్రం ఇబ్బందులు పెడుతోందని అన్నారు. ‘‘నేను ఎథిక్స్ కమిటీ రిపోర్టు చదివాను. మహువాపై విచారణ జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేనప్పుడు లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలని సిఫార్సు చేయాల్సిన అవసరమేముంది? ఇది కేంద్ర ప్రభుత్వ చర్యగా నేను భావిస్తున్నాను. మహువా.. ఫైర్ బ్రాండ్ లీడర్. ఈ యుద్ధాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కోగలదు” అని అన్నారు. కాగా, స్కూల్ జాబ్స్ స్కామ్ కేసులో అభిషేక్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. 
కొన్ని డాక్యుమెంట్లు ఈడీకి అందజేశారు.