టీఎంసీ ఎంపీల చేరికతో పార్లమెంట్లో పెరిగిన ఎన్డీయే బలం!

టీఎంసీ ఎంపీల చేరికతో పార్లమెంట్లో పెరిగిన ఎన్డీయే బలం!
  • వివాదాస్పద బిల్లులను ఆమోదించుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌
  • 40 ఏండ్లుగా మమతతో ఉన్నా..దేశ భద్రత కోసమే ఎన్డీయేకు మద్దతు: కాకోలి ఘోష్

కోల్‌‌‌‌‌‌‌‌కతా/ న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో మరింత బలం చేకూరనుంది. టీఎంసీకి చెందిన 20 మంది లోక్‌‌‌‌‌‌‌‌సభ సభ్యులు ఎన్డీయే కూటమిలో చేరాలని నిర్ణయించుకోవడంతో లోక్‌‌‌‌‌‌‌‌సభలో కీలక బిల్లుల ఆమోదం ప్రభుత్వానికి మరింత సులభతరం కానుంది. రాజ్యసభలో కూడా ఎన్డీఏకు ఒక స్థానం పెరగనుంది. టీఎంసీకి చెందిన సీనియర్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం 543 మంది సభ్యులున్న లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఎన్డీయేకు 293 మంది, 245 మంది సభ్యులున్న రాజ్యసభలో 149 మంది బలం ఉంది. లోక్‌‌‌‌‌‌‌‌సభలో బలం పెరగడం వల్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వివాదాస్పద బిల్లులను ఆమోదింపజేసుకోవడం సులువవుతుంది. వీటిలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌ బిల్లు), దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2024’, అలాగే ‘యూనియన్ టెరిటరీస్ లాస్ (అమెండ్‌‌‌‌‌‌‌‌మెంట్) బిల్లు, 2026’ను ఆమోదించుకోవడానికి ఈ అదనపు బలం ఉపయోగపడనుంది. 

ప్రస్తుతం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలిస్తోంది. టీఎంసీతో పాటు దక్షిణాదికి చెందిన డీఎంకే పార్టీ కూడా ఎన్డీయేకు మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. లోక్‌‌‌‌‌‌‌‌సభలో డీఎంకేకు 22 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. అయితే, ఈ వార్తలను డీఎంకే రాజ్యసభ ఎంపీ ఒకరు ఖండించారు. ఎన్డీయేతో తాము కూటమి కట్టడం లేదన్నారు.

తల తెగినా సరే లొంగే ప్రసక్తే లేదు: కాకోలి ఘోష్

మాజీ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంపై  తిరుగుబావుటా ఎగురవేస్తూ 19 మంది అసమ్మతి ఎంపీలతో కలిసి బారాసత్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ఎన్డీయే గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘తల తెగినా సరే.. లొంగే ప్రసక్తే లేదు” అంటూ టీఎంసీకి సవాల్ విసిరారు. గత 40 ఏండ్లుగా మమతా బెనర్జీతో కలిసి నడిచానని, అధికారం లేనప్పుడూ వెంటే ఉన్నానని కాకోలి ఘోష్ గుర్తుచేశారు. 

కానీ, గత నాలుగేండ్లుగా బెంగాల్‌‌‌‌‌‌‌‌లో పరిస్థితి ఘోరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బెంగాల్‌‌‌‌‌‌‌‌లో విద్య, వైద్య రంగాలు, చిత్ర పరిశ్రమ పూర్తిగా కుప్పకూలాయి. శాంతిభద్రతలు క్షీణించాయి. కొంతమంది నాయకుల ఇష్టారాజ్యానికి అనుగుణంగా పనిచేయాలని ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ భద్రత కోసం మేం ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం”అని ఆమె పేర్కొన్నారు. 

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండాలంటే లోక్‌‌‌‌‌‌‌‌సభలోని మొత్తం 28 మంది టీఎంసీ ఎంపీలలో 2/3 వంతు (కనీసం 19 మంది) సభ్యుల మద్దతు అవసరం. తమకు 20 మంది ఎంపీల మద్దతు ఉందని, సభలో ప్రత్యేక బ్లాక్‌‌‌‌‌‌‌‌గా కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే లేఖ పంపినట్లు కాకోలి ఘోష్ స్పష్టం చేశారు.