ఐటీ కారిడార్ గోపనపల్లిలో హైడ్రామా .. టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల పాగా

ఐటీ కారిడార్ గోపనపల్లిలో హైడ్రామా .. టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల పాగా
  • రాత్రికి రాత్రే స్థలం చుట్టూ ఫెన్సింగ్
  • తమ స్థలాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఎన్జీవో నాయకుల ఆందోళన

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​ గోపనపల్లిలో బుధవారం హైడ్రామా నడిచింది. గోపనపల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీకి చెందిన భూముల్లో ప్రైవేటు వ్యక్తులు కోర్టు ఆర్డర్​పేరుతో రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేయడం వివాదానికి దారి తీసింది. వినాయక నగర్ హౌసింగ్ సొసైటీ పేరు మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందంటూ దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఫెన్సింగ్ వేసి భూమి చదును పనులు చేపట్టారు. దీంతో 17 ఏండ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిలో అకస్మాత్తుగా ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా హక్కులు వచ్చాయంటూ టీఎన్జీవో సభ్యులు ఆందోళన చేపట్టారు. 

బుధవారం గోపనపల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావులు హాజరై ఉద్యోగుల పక్షాన పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. 2008లో నాటి ప్రభుత్వం టీఎన్జీవో, ఏపీఎన్జీవో, సెక్రటేరియట్, హైకోర్టు ఉద్యోగుల కోసం 428 ఎకరాల భూమిని గోపనపల్లిలో ఇండ్ల స్థలాల కోసం కేటాయించిందన్నారు. 

సర్వే నంబర్ 36,37లో నాటి ఏపీఎన్జీవోల కోసం 189.11 ఎకరాల భూమిని కేటాయించగా, సర్వేనెంబర్ 36లోని 142.15 ఎకరాల భూమిలో జీహెచ్ఎంసీకి 18 కోట్ల రూపాయలు చెల్లించి 2010లో అప్రూవల్ లేఅవుట్ వేసినట్లు తెలిపారు. అందులోని ఫ్లాట్లను 2,800 మంది ఉద్యోగులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీకి 40 శాతం మార్టిగేజ్ చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సైతం చేసినట్లు తెలిపారు. కాగా, 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 1088 జీవో ఇచ్చి సదరు భూమిని ప్రభుత్వం రెస్యూమ్ చేసిందన్నారు. దీంతో 2019లో ఉద్యోగుల విభజన అనంతరం భాగ్యనగర్ టీఎన్జీవో సొసైటీగా ఏర్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం భాగ్యనగర్ సొసైటీలో 4,000 మంది టీఎన్జీవోలు సభ్యులుగా ఉన్నారన్నారు. కొంతకాలంగా వినాయక నగర్ సొసైటీ పేరుతో తమకు కేటాయించిన భూమిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వాపోయారు.