కేసీఆర్ కు సామాజిక న్యాయం గుర్తుకు రావాలంటే దుబ్బాక సెగ తగలాలి

కేసీఆర్ కు సామాజిక న్యాయం గుర్తుకు రావాలంటే దుబ్బాక సెగ తగలాలి

కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

దుబ్బాక:  కేసీఆర్ కు సామాజిక న్యాయం గుర్తుకు రావాలంటే దుబ్బాక ఉప ఎన్నికల సెగ తగలాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాకలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి తన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి.. ఉద్యోగాల భర్తీ.. పంటనష్టం..  వంటివి కేసీఆర్ కు గుర్తు రావాలి అంటే దుబ్బాకలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన కోరారు. దుబ్బాక నియోజకవర్గ  ప్రజలు చెరుకు ముత్యంరెడ్డి సేవలు మర్చిపోలేదని.. దుబ్బాకలో ఇప్పుడున్న అభివృద్ధి అంతా చెరుకు ముత్యంరెడ్డి హయాంలో చేసిందేనని ఆయన పేర్కొన్నారు. లక్షల జీతం వదులుకొని ప్రజలకు సేవచేయడానికి శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎన్నికల పోటీలో ఉన్నారని ఆయన వివరించారు. రామలింగారెడ్డి పై హరీష్ రావు కు ప్రేమ ఉంటే రామలింగారెడ్డికి మంత్రి పదవి  అవకాశం ఎందుకు ఇవ్వలేదు..? నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఉన్న రామలింగారెడ్డి దుబ్బాకకు ఏమీ చేయలేదు.. రాజకీయాలకు కొత్త అయిన ఆయన సతీమణి ఏమి చేయగలరు ? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై వారి సొంతపార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని.. రఘునందన్-కేసీఆర్- హరీష్ రావు ఒక్కటే కుటుంబం.. రఘునందన్ రావు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు.. ఆయన గెలిస్తే మళ్లీ టీఆర్ ఎస్ కు వెళ్తారని ఆయన జోస్యం చెప్పారు.