రైతు సమస్యలపై ఇయ్యాల, రేపు కాంగ్రెస్ ప్రదర్శనలు

రైతు సమస్యలపై ఇయ్యాల, రేపు కాంగ్రెస్ ప్రదర్శనలు
  • పీసీసీ చీఫ్​ రేవంత్ పిలుపు
  • కేసీఆర్ పాలనలో రైతు చావుల లెక్క బయట పడ్డదని ట్వీట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై సర్కార్​ మొసపూరిత చర్యలను నిరసిస్తు రాష్ట్ర వ్యాప్తంగా 2రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం, గురువారం రెండ్రోజులు అన్ని మండలాలు, జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు చేపట్టి అధికారులకు వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాలు చేయాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు పెంచాలని కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. బుధవారం రాష్ట్రంలో అన్ని మండలాలలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈప్రదర్శనలు చేపట్టాలన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వినతిపత్రాలు అందజేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్ల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపంగా మారాయని రేవంత్ విమర్శించారు. సెంటర్లకు వడ్లు తెచ్చి రైతులు ఎదురుచూస్తున్నారని, వానలకు వడ్లు పాడైతున్నా సర్కార్ పట్టించుకోవట్లేదని అన్నారు. కల్లాల దగ్గరే రైతులు గుండె ఆగి, పాములు కరిచి చనిపోతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించలేదని మండిపడ్డారు.
సాయం కోసం కన్నీళ్లు
‘కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, తెలంగాణలో రైతుల చావుల లెక్క బయటపడింది’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘సాయం కోసం రైతు కుటుంబాలు కోర్టు ముందు కన్నీళ్లు పెడుతున్నాయి, 67 వేల మందికి పరిహారం ఇచ్చామంటున్న సర్కారుకు  3,942 మంది భారమయ్యారా? రైతు బీమా పథకం 59 ఏండ్ల లోపు వాళ్లకే వర్తింస్తుంది. ఈ67 వేల పైచిలుకు చావులు సహజ మరణాలు కానట్టే కదా’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ 
చేశారు.