ఫైనల్ పోరు.. టైటిల్ వేటలో ఢిల్లీ.. ఐదో టైటిల్ పై ముంబై గురి

ఫైనల్ పోరు.. టైటిల్ వేటలో ఢిల్లీ.. ఐదో టైటిల్ పై ముంబై గురి

ఓవైపు వారసత్వం, ఆధిపత్యం.. మరోవైపు పోరాటం, సంచలనం..! ఒకరిదేమో 4సార్లు టైటిల్స్‌ గెలిచిన చరిత్ర..  మరొకరిదేమో ఫస్ట్‌ టైటిల్‌ కోసం ఆరాటం..! ఈ నేపథ్యంలో అరబ్‌ గడ్డపై ఐపీఎల్‌–13 అంతిమ సమరానికి ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ సిద్ధమయ్యాయి..! బలాన్ని చూసినా.. బలగాన్ని అంచనా వేసినా.. ఈ మ్యాచ్‌లో ముంబై ఫేవరెట్‌..! అయితే పుష్కరకాలంగా చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కాలంటే ఈసారి టైటిల్‌ కొట్టాలన్నది ఢిల్లీ టార్గెట్‌..! ఇరుజట్లలో స్టార్లకు కొదవలేకపోయినా… హీరో అయ్యేదెవరో..?  మొత్తానికి కరోనాను పక్కనబెడుతూ.. 52 రోజుల పాటు ప్రపంచ క్రికెట్‌ను ఊపేసిన మెగా లీగ్‌లో నయా వారసుడు వస్తాడా? పాత చాంపియన్‌ కొత్త చరిత్ర సృష్టిస్తాడా?

దుబాయ్‌‌: ఐపీఎల్‌‌–13 ముగింపు దశకు చేరుకుంది. అద్భుతమైన ఆట, అంతకుమించిన పోరాటలతో ఆద్యంతం మెగా లీగ్‌‌ను రక్తికట్టించిన రెండు సూపర్‌‌ టీమ్‌‌లు ముంబై ఇండియన్స్‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌‌..  మంగళవారం జరిగే మెగా ఫైనల్‌‌కు సిద్ధమయ్యాయి. ఆల్‌‌రౌండర్ల అండతో ముంబై బలంగా కనిపిస్తుంటే.. కుర్రాళ్లతో ఢిల్లీ రంకెలేస్తోంది. అయితే ఎక్స్‌‌పీరియెన్స్‌‌ పరంగా రోహిత్‌‌సేన ఓ మెట్టుపైనే ఉన్నా.. ఢిల్లీ తెరవెనుక మంత్రాంగంలో పాంటింగ్‌‌ రూపంలో ఓ బలమైన శక్తి అడ్డుగా ఉన్నాడు. దీనిని ముంబై అధిగమిస్తుందా? లేదా? చూడాలి. ఇక ఈ మ్యాచ్‌‌లో ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటికే లీగ్‌‌ హిస్టరీలో అత్యధికంగా నాలుగుసార్లు చాంపియన్‌‌గా నిలిచిన ముంబై ఐదో టైటిల్‌‌పై కన్నేయగా, ఫస్ట్‌‌ టైటిల్‌‌ గెలిచి లెజెండ్స్‌‌ సరసన చేరాలని ఢిల్లీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే పేపర్‌‌ మీద రెండు టీమ్‌‌లను పరిశీలిస్తే.. ఎవర్నీ తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు.  ఆడిన 15 మ్యాచ్‌‌ల్లో 10 విజయాలతో రోహిత్‌‌సేన సూపర్‌‌ ఫామ్‌‌లో ఉండగా, 16 మ్యాచ్‌‌ల్లో 9 విజయాలతో శ్రేయస్‌‌ బృందం మంచి జోష్‌‌మీదుంది. అయితే 12 ఏళ్లుగా చేస్తున్న పోరాటంలో ఇప్పుడిప్పుడే తమ పూర్తి సత్తాను బయటపెడుతున్న ఢిల్లీ.. ఫైనల్‌‌ ఫోబియాను జయిస్తుందో లేదో చూడాలి. 2017 నుంచి ధోనీ  (సీఎస్​కే) లేకుండా ఐపీఎల్‌‌ ఫైనల్‌‌ జరగలేదు. కానీ ఈసారి అది జరుగుతుండటంతో ప్రతి ఒక్కరి దృష్టి దానిపైనే పడింది.

అందరూ హిట్టర్లే..

ఐపీఎల్‌‌లో ఎన్ని టీమ్‌‌లు ఉన్నా.. ముంబై జట్టులో ఉండే బ్యాలెన్స్‌‌ ఎందులోనూ లేదు. పర్‌‌ఫెక్ట్‌‌ హిట్టర్లకు తోడుగా సూపర్‌‌ ఆల్‌‌రౌండర్లు ఉండటం జట్టుకు అదనపు బలం. స్టాట్స్‌‌ పరంగా చూసినా ముంబై హిట్లరు ఇప్పటివరకు 130 సిక్స్‌‌లు బాదారు. ఢిల్లీ స్టార్లు 84 కొట్టారు. ఓపెనింగ్‌‌లో డికాక్‌‌కు తోడుగా రోహిత్‌‌ కుదురుకుంటే స్కోరు బోర్డు పరుగెత్తాల్సిందే. ఈ ఇద్దరు కొట్టే సిక్సర్లను అడ్డుకోవడం ఏ అపోనెంట్‌‌కైనా కష్టమే. అయితే రోహిత్‌‌ హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ గాయంతో ఇబ్బందిపడుతుండటం ప్రతికూలాంశం. వన్‌‌డౌన్‌‌లో సూర్యకుమార్‌‌ (60 ఫోర్లు, 10 సిక్స్‌‌లు) పేసర్లను హ్యాండిల్‌‌ చేస్తున్న తీరు సూపర్బ్‌‌. ఐదున్నర అడుగుల ఇషాన్‌‌ కిషన్‌‌ 29 సిక్స్‌‌లు కొట్టాడంటే ఎవరూ నమ్మరు. ప్రతి మ్యాచ్‌‌లో కీలక ఇన్నింగ్స్‌‌ ఆడిన ఈ జోడీని నిలువరించడం ఢిల్లీకి పెను సవాలే. ఈ సీజన్‌‌లో పొలార్డ్‌‌ స్ట్రయిక్‌‌ రేట్‌‌ 190 ప్లస్‌‌గా ఉంది. ఢిల్లీ పేసర్లు రబాడ (29 వికెట్లు), అన్రిచ్‌‌ నోర్జ్‌‌ (20) వీళ్లను నిలువరించినా.. మిడిలార్డర్‌‌లో పాండ్యా బ్రదర్స్‌‌తో ముప్పు తప్పదు. క్రునాల్‌‌ కూల్‌‌గా ఆడినా.. హార్దిక్‌‌ దారుణంగా కొడతాడు. స్లాగ్‌‌ ఓవర్స్‌‌లో చిన్నోడు నిలబడితే మజిల్‌‌ పవర్‌‌తో సిక్సర్ల వర్షం కురవాల్సిందే. బౌలింగ్‌‌లో బుమ్రా, బౌల్ట్‌‌ను ఎదుర్కోవడం ఎంత పెద్ద ప్లేయర్‌‌కైనా కత్తిమీద సామే. స్టార్టింగ్‌‌, స్లాగ్‌‌ ఓవర్స్‌‌లో వీళ్లను తట్టుకుని నిలబడితే ఢిల్లీ గెలిచినట్లే.  ఫైనల్లో ప్యాటిన్సన్‌‌, కూల్టర్‌‌నైల్‌‌లో ఒకరికి చాన్స్‌‌ దక్కొచ్చు. స్పిన్నర్లు రాహుల్‌‌ చహర్‌‌, క్రునాల్‌‌ మిడిల్‌‌ ఓవర్స్‌‌ను బాగా కట్టడి చేస్తారు. ఎక్కువ మంది ఆల్‌‌రౌండర్లు ఉండటంతో బౌలింగ్‌‌లోనూ అనేక ప్రత్యామ్నాయాలు రోహిత్‌‌ ముందున్నాయి. కాబట్టి సరైన టైమ్‌‌లో సరైన ప్లేయర్‌‌ను ఎంచుకోవడమే కెప్టెన్​ రోహిత్​  ముందున్న అతిపెద్ద సవాలు.

ధవన్‌‌ నిలబడితే..

హైదరాబాద్‌‌పై ఆడిన టీమ్‌‌నే ఫైనల్‌‌ పోరుకు దించాలని ఢిల్లీ మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. దీంతో  ప్రతి మ్యాచ్‌‌లో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్‌‌ ధవన్‌‌ (603) మరోసారి బ్యాటింగ్‌‌కు పెద్ద దిక్కు కానున్నాడు. టీమ్‌‌ బ్యాలెన్స్‌‌ కోసం ఆల్‌‌రౌండర్‌‌ స్టోయినిస్‌‌ (352 రన్స్‌‌ 12 వికెట్లు)ను ఓపెనర్‌‌గా కొనసాగించే చాన్స్‌‌ ఉంది. అయితే ఈ ఇద్దరు బుమ్రా, బౌల్ట్‌‌ యార్కర్లను హ్యాండిల్‌‌ చేస్తేనే స్కోరు పెరిగే చాన్స్‌‌ ఉంటుంది. అయితే  ఈ సీజన్‌‌లో ముంబైతో తలపడిన మూడు మ్యాచ్‌‌ల్లో ఓడటం క్యాపిటల్స్‌‌ కాన్ఫిడెన్స్‌‌ను దెబ్బతీసే అంశం. బిగ్‌‌ హిట్టర్‌‌ హెట్‌‌మయర్‌‌ మరోసారి మెరవాల్సిందే. పవర్‌‌ప్లేలో వికెట్‌‌ పడితే అతను.. అయ్యర్‌‌ కంటే ముందుగానే బ్యాటింగ్‌‌కు రావొచ్చు. ఈ టోర్నీలో రిషబ్‌‌ పంత్‌‌ ఇప్పటివరకు తన సత్తాను చూపెట్టలేదు. కనీసం ఈ మ్యాచ్‌‌లోనైనా భారీ ఇన్నింగ్స్‌‌ ఆడితే టీమ్‌‌కు మేలు జరుగుతుంది. రహానె ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఢిల్లీ టీమ్‌‌లో మరో బిగ్‌‌ ఫ్యాక్టర్‌‌ అశ్విన్‌‌. పవర్‌‌ప్లేలోనూ రన్స్‌‌ను కట్టడి చేయడంలో స్పెషలిస్ట్‌‌. అయితే రోహిత్‌‌ను ఎంతమేరకు ఇబ్బందిపెడతాడో చూడాలి. అక్షర్‌‌ పటేల్‌‌పై కూడా పెద్ద భారమే ఉంది. పేస్‌‌లో రబాడ,  స్టోయినిస్‌‌, అన్రిచ్‌‌ బృందం బలంగానే కనిపిస్తున్నది.