
వివాహ వేడుకలో మంత్రులు
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కుమారుడు మణిదీప్, లక్ష్మీ స్నేహిత దంపతులను మంత్రులు ఆశీర్వదించారు. ఆదివారం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో జరిగిన వివాహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారిలో హెల్త్మినిస్టర్హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రాణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యేలు జోగు రామన్న, దాసరి మనోహర్ రెడ్డి, నోముల భగత్, సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, భానుప్రసాద్ రావు, మేయర్ అనిల్ కుమార్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్, పెద్దపల్లి డీసీపీ రూపేశ్, టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, రాజకీయ, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్పొరేటర్లు హాజరయ్యారు.
40 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
మానవ మనుగడకు అడవులే ఆధారం
జిల్లా కలెక్టర్ కర్ణన్
తిమ్మాపూర్, వెలుగు: జిల్లాలో ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకుని ఇప్పటికి 35 లక్షలు నాటామని కలెక్టర్ కర్ణన్ అన్నారు. ఆదివారం మండలంలోని మహాత్మానగర్, ఎల్ఎండీ కాలనీ, ఫ్రీడమ్ పార్క్ లో ఆదివారం 12 వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ విజయ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడారు. వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఒక్కరోజే 5 లక్షల మొక్కలు నాటామన్నారు. పచ్చదనం మన ప్రగతికి సంకేతమని, మొక్కలు నాటి కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, డీఎఫ్ఓ వెంకటేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్ఈ శివ కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి ఆస్మాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
మిడ్ మానేరు నిర్వాసితుల
ఐక్యవేదిక అధ్యక్షుడు రవీందర్
వేములవాడ, వెలుగు: నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మిడ్ మానేరు నిర్వాసితుల ఐక్య వేదిక అధ్యక్షుడు కె.రవీందర్ కోరారు. ఆదివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్వాసితుల సమస్యపై వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్29వ తేదీలోపు నిర్ణయం తెలపాలన్నారు. లేకపోతే ముంపు గ్రామాల జీపీలకు తాళాలు వేస్తామన్నారు. సమావేశంలో నిర్వాసితుల ఐక్యవేదిక లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.
డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
గన్నేరువరం, వెలుగు: రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ నుంచి మండల కేంద్రం గన్నేరువరం మీదుగా పోత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం గన్నేరువరం ఎంపీపీ మల్లారెడ్డి కుమారుడి వివాహానికి వినోద్కుమార్హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు సమస్యలు వివరించారు. మండలానికి డబుల్ రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, గుంతల రోడ్డుతో ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. దీంతో స్పందించిన వినోద్కుమార్డబుల్ రోడ్డు నిర్మాణంపై హామీ ఇచ్చారు.
ఫీజుల దోపిడీ అరికట్టాలి
బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్
మెట్ పల్లి, వెలుగు : నారాయణ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ ఆరోపించారు. ఆదివారం మెట్ పల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నారాయణ జూనియర్ కాలేజీ ఘటనను తీవ్రంగా పరిగణించి ఆ విద్యా సంస్థలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ స్టూడెంట్కుటుంబానికి న్యాయం చేసి, కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా అధికార ప్రతినిధి నరేశ్, రంజిత్ పాల్గొన్నారు.
కాజ్ వేలకు మరమ్మతులెప్పుడో?
నిధులు మంజూరైనా పట్టించుకోని అధికారులు
దూర భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
కోనరావుపేట, వెలుగు: భారీ వర్షాలకు కోనరావుపేట మండలంలోని కాజ్ వేలన్నీ కొట్టుకుపోయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదు. వానలకు మండలంలోని మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగుపై ఉన్న వట్టిమల్ల -నిమ్మపల్లి, వెంకట్రావుపేట- బావుసాయిపేట, మామిడిపల్లి -నిజామాబాద్ గ్రామాల మధ్య కాజ్ వేలు పూర్తిగా కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి. అలాగే నిమ్మపల్లి ప్రధాన రహదారి పెంటి వాగుపై ఉన్న కాజ్ వేలు, గొల్లపల్లి ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయి రెండు నెలలు గడుస్తున్నాయి. అయినా అధికారులు, లీడర్లు పట్టించుకోవడం లేదు. దీంతో మండల కేంద్రానికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి నిమ్మపల్లి, మరిమడ్ల మీదుగా నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు పూర్తిగా ధ్వంసం కావడంతో వేరే దారిగుండా బస్సులు, వాహనాలు ప్రయాణించేందుకు అవస్థలు పడుతున్నారు. మరోవైపు కాజ్‌వేలు ధ్వంసం కావడంతో మూలవాగు అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పొలం పనులకు కూలీలు కూడా రావడం లేదని, ఎరువులు తీసుకెళ్లడానికి వాహనాలు అద్దెకు తీసుకొని చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. కాజ్‌వేల మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు చేపట్టకపోవడంపై మండల ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పనులను చేపడతాం
కోనరావుపేట మండలంలో వర్షాలకు ధ్వంసమైన 6 కాజ్‌వేల తాత్కాలిక మరమ్మతులకు రూ.19లక్షలు మంజూరయ్యాయి. వర్షాలు కురిస్తే మళ్లీ కొట్టుకుపోతాయని పనులు చేపట్టలేదు. మూలవాగు ప్రవాహం తగ్గగానే పనులను చేపడతాం.
- సతీశ్, ఏఈ, ఆర్ అండ్‌బీ
శిథిల భవనాల్లో చదువులెట్ల?
కరీంనగర్జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం హైస్కూల్ భవనం శిథిలావస్థకు చేరింది. పాఠశాలలో మొత్తం 11 గదులు ఉండగా నాలుగు గదులు ఇటీవలి వర్షాలకు కూలిపోయాయి. దీంతో మొత్తం 236 మంది స్టూడెంట్లను మెర్జ్ చేసి 7 గదుల్లో పాఠాలు చెబుతున్నారు. అవికూడా శిథిలావస్థకు చేరడంతో స్టూడెంట్లు భయాందోళన మధ్య చదువు కొనసాగిస్తున్నారు. గదులపై చెట్లు మొలుస్తున్నాయని, స్కూల్ ప్రహరీ కూలి నెల దాటిందని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్టూడెంట్లు, టీచర్లు కోరుతున్నారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్
వధూవరులకు మంత్రి ఆశీస్సులు
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లోని కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి. రవీందర్ రావు కుమారుడు సాకేత్ రామారావు, డాక్టర్ శాలిని దంపతులను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆశీర్వదించారు. ఆగస్టు 17న హైద్రాబాద్ లోని శుభం గార్డెన్స్ లో రామారావు, శాలిని వివాహం జరిగింది. ఆదివారం కరీంనగర్ లోని వారి ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ వ్రతానికి మంత్రి హాజరై వధూవరులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
‘ది 12 పెరల్స్’ పుస్తకావిష్కరణ
కరీంనగర్ టౌన్, వెలుగు: నగరంలోని అద్వైత స్కూల్ లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి సైని స్నితిక్ రచించిన ‘ది 12 పెరల్స్’ పుస్తకాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల వయసులో సైని స్నితిక్ ఇంగ్లిష్‌లో 12 కథలు రాయడం గొప్ప విషయమన్నారు. ఉప్పుపై రాసిన కథతో పాటు ఇతర సామాజిక విలువలతో రాసిన కథలు చదివే వారిని ఆలోచింపజేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సౌగాని కొమురయ్య, పేరెంట్స్ విద్య, నరేందర్, గంగుల శ్రీకర్, పత్తెం వసంత, అమిరిశట్టి కిషన్ పాల్గొన్నారు.
ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి
కాల్వశ్రీరాంపూర్, వెలుగు: మండలంలోని పెద్ద రాతిపల్లి గ్రామానికి చెందిన నేదురి వేణు(25) ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దరాతిపల్లి గ్రామానికి చెందిన బండి శ్రీనివాస్ ట్రాక్టర్లో ఇసుక పోయడానికి శనివారం రాత్రి వేణు కూలి పనికి వెళ్లాడు. ఇసుక నింపిన ట్రాక్టర్ తో అదే రోజు రాత్రి డ్రైవర్ తో కలిసి ముత్తారం మండలం మైదముబండ గ్రామానికి వెళ్లి ఇసుక పోసి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో శ్రీనివాస్ పక్కన కూర్చొన్న వేణు ప్రమాదవశాత్తు కింద పడిపోగా ట్రాక్టర్అతడి పైనుంచి వెళ్లింది. వేణును పెద్దపెల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజావర్ధన్ తెలిపారు.
అమిత్ షా కు కార్పొరేటర్ల స్వాగతం
కరీంనగర్ టౌన్, వెలుగు: మునుగోడులో నిర్వహించే సభ కోసం ఆదివారం హైదరబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాకు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. వారిలో కార్పొరేటర్లు శ్రీనివాస్ ఉన్నారు.
కరీంనగర్‌ను గ్రీన్‌సిటీగా మారుద్దాం
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజలందరి భాగస్వామ్యంతో కరీంనగర్ పట్టణాన్ని గ్రీన్ సిటీగా మార్చుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వజ్రోత్సవంలో భాగంగా ఆదివారం స్థానిక పద్మానగర్ లోని బుల్ సెమెన్ సెంటర్ లో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్లు కీలకపాత్ర వహిస్తాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 15రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క సేవా కార్యక్రమంతో ప్రజల్లో దేశభక్తిని, జాతీయభావాన్ని పెంచేందుకు వజ్రోత్రవ వేడుకలు జరిగాయని గుర్తు చేశారు. 14వ రోజు ఆదివారం మెగా ప్లాంటేషన్ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, కమిషనర్ సేవా ఇస్లావత్ పాల్గొన్నారు.