ఫ్రంట్ కోసమా.. యూపీఏ కోసమా? స్టాలిన్ తో నేడు కేసీఆర్ భేటీ

ఫ్రంట్ కోసమా.. యూపీఏ కోసమా?  స్టాలిన్ తో నేడు కేసీఆర్ భేటీ

హైదరాబాద్‌, వెలుగు: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే స్టాలిన్‌తో కేసీఆర్​ సోమవారం సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరారు. ఎంపీలు వినోద్‌కుమార్‌, సంతోష్‌, కొందరు ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్​ వెంట ఉన్నారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు స్టాలిన్‌‌తో కేసీఆర్​భేటీ అవుతారు. అయితే.. ఇది కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏలో భాగస్వామిగా ఉన్న డీఎంకే, ఫెడరల్​  ఫ్రంట్​ పేరుతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్​ల మీటింగ్ కావడం సర్వత్రా చర్చకు దారితీస్తున్నది. ఇప్పటికే తమ పార్టీ కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకుందని స్టాలిన్​ చెప్తున్నారు. కాంగ్రెస్​తో కలిసి ఉన్న వ్యక్తిని కేసీఆర్​ కలవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఆసక్తికి దారితీసింది.

ఫెడరల్​ ఫ్రంట్​ కోసమే స్టాలిన్​ను  కేసీఆర్​ కలువనున్నారా? లేక యూపీఏతో కలిసి ఆయన ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నారా అనే అంశం రాజకీయ వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది. ఈ నెల 6న కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు కేసీఆర్‌‌ వెళ్లారు. ఈ నెల 13న(సోమవారం) సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో స్టాలిన్‌‌తో కేసీఆర్ భేటీ అవుతారని టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు అప్పట్లోనే అధికారికంగా ప్రకటించాయి. అయితే, తమిళనాడులోని మదురై వెళ్లిన కేసీఆర్.. చెన్నై వెళ్లకుండా తిరిగి హైదరాబాద్​ వచ్చేశారు. కేసీఆర్‌‌ ప్రతిపాదన మేరకు మొదట ఆయనను చెన్నైకి ఆహ్వానించిన స్టాలిన్‌‌ తర్వాత ఉప ఎన్నికల పేరుతో ముఖం చాటేయడంతోనే కేసీఆర్​ వెనక్కి వచ్చేసినట్లు తమిళ మీడియా, జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రెండు రోజులపాటు హైదరాబాద్‌‌ నుంచే తన మంత్రాంగాన్ని నడిపిన కేసీఆర్‌‌.. అనుకున్న సమయానికే చెన్నైలో స్టాలిన్‌‌తో సమావేశం కాబోతున్నారు.

స్టాలిన్​ను ఒప్పించిన కుమారస్వామి!
తాజాగా స్టాలిన్‌‌తో టీఆర్‌‌ఎస్‌‌ బాస్‌‌ మీటింగ్‌‌ను ఖాయం కావడం వెనుక పెద్ద కథే నడిచినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందుకోసం జేడీఎస్​చీఫ్, కర్నాటక సీఎం కుమారస్వామి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో దాదాపు 15 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉన్న టీఆర్‌‌ఎస్‌‌ మద్దతు అవసరమవుతుందని స్టాలిన్​తో కర్నాటక సీఎం కుమారస్వామి  మాట్లాడినట్టు ప్రచారంలో ఉంది. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే యూపీఏలోని భాగస్వామ్యపక్షాలతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ కలవాల్సి ఉందని, ఇందుకోసం టీఆర్‌‌ఎస్‌‌ అవసరం కూడా ఉంటుందని కుమారస్వామి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆయన మధ్యవర్తిత్వంతోనే ముందు అనుకున్న షెడ్యూల్​ ప్రకారం కేసీఆర్‌‌ను కలవడానికి స్టాలిన్‌‌ అంగీకరించినట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

కేంద్రంలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్‌‌ ఫిగర్‌‌ (272 సీట్లు)కు 30 నుంచి 40 సీట్ల దూరంలో ఎన్‌‌డీఏ ఆగిపోవచ్చని, యూపీఏలోని ప్రధానపక్షం కాంగ్రెస్‌‌ వంద నుంచి 120 లోపు సీట్లే గెలువవచ్చని, ప్రాంతీయ పార్టీలు 150 సీట్లకుపైగా గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నట్టుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కూటమి కడితే  ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌‌ మద్దతు ఇవ్వవచ్చని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్‌‌ఎస్‌‌ సైతం ఆ కూటమిలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న టీఆర్​ఎస్​ రూటు?
ఫెడరల్​ ఫ్రంట్​ పేరిట ప్రయత్నాలు మొదలుపెట్టిన టీఆర్​ఎస్​.. లోక్​సభ నోటిఫికేషన్‌‌ వరకు బీజేపీతో సఖ్యతగా ఉన్నట్లు, అటు తర్వాత దూరం జరుగుతూ వస్తున్నట్లు  ప్రచారంలో ఉంది. మూడు దశల ఎన్నికలు పూర్తయ్యే సరికి గులాబీ పార్టీ లైన్‌‌ మారినట్టుగా బీజేపీ సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌‌ సహా టీఆర్​ఎస్​లోని కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఐటీ నోటీసులు రావడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని గులాబీ నేతలు అనుమానిస్తున్నారు. మరోసారి కేంద్రంలో మోడీ అధికారాన్ని చేపడితే ఇలాంటి చిక్కులే ఎదురవుతాయనే అనుమానంతో టీఆర్‌‌ఎస్‌‌ తన అడుగులను యూపీఏ దిశగా మార్చుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌‌కు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ ఏర్పాటు కోసం కేసీఆర్‌‌ యేడాది క్రితం నుంచి ప్రయత్నిస్తున్నారు.

అదే సమయంలో కర్నాటక, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్‌‌, పశ్చిమబెంగాల్‌‌లో పర్యటించిన ఆయన అక్కడి ప్రాంతీయ పార్టీల చీఫ్​లతో చర్చలు జరిపారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్​ విజయం తర్వాత మళ్లీ ఒడిశా, బెంగాల్‌‌కు వెళ్లి చర్చలు జరిపారు. ప్రస్తుతం లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ నెల 6న కేరళ, తమిళనాడు పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌‌.. మొదట కేరళ సీఎం విజయన్​తో సమావేశమయ్యారు. సోమవారం వరకు ఆ పర్యటనలోనే ఉండి చెన్నైలో స్టాలిన్​తోనూ భేటీ అవుతారని అనుకున్నప్పటికీ  ఉప ఎన్నికల పేరిట స్టాలిన్​ ముఖం చాటేశారు. దీంతో వెనక్కి వచ్చిన కేసీఆర్​..  తిరిగి తన సన్నిహితుడు, కర్నాటక సీఎం ద్వారా ఆ చిక్కులను అధిగమించి షెడ్యూల్​ ప్రకారం సోమవారం స్టాలిన్‌‌తో భేటీ కాబోతున్నారు.

సర్వే లెక్కలతో స్టాలిన్ వద్దకు!
లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చు, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాలపై కేసీఆర్‌‌ విస్తృత సమాచారంతో డీఎంకే చీఫ్​ స్టాలిన్‌‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.  జాతీయ సర్వే సంస్థల వివరాలను ఈ సందర్భంగా ప్రస్తావించి బీజేపీయేతర  ఫ్రంట్‌‌ ఏర్పాటును ప్రతిపాదించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. చెన్నై టూర్‌‌ తర్వాత, లోక్​సభ ఫలితాల్లోగా కేసీఆర్‌‌ ఉత్తరాది పర్యటనకు వెళ్తారని టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య నేతలు చెప్తున్నారు. అక్కడ పలు ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయి బీజేపీయేతర కూటమి దిశగా అడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌‌ గౌరవప్రదమైన స్థానాలిస్తే ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారులో, లేకపోతే కాంగ్రెస్‌‌ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమిని గద్దెనెక్కించడమే ధ్యేయంగా కేసీఆర్‌‌ టూర్‌‌ ఉండబోతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.