- కరణం మల్లేశ్వరి తర్వాత ఈ ఘనత సాధించిన తొలి లిఫ్టర్
- షూటింగ్‌లో రెండు కాంస్యాలు
- బ్యాడ్మింటన్, సాఫ్ట్ టెన్నిస్‌లోనూ బ్రాంజ్
నగోయా: ఆసియా గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో పతక నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో మీరాబాయి మొత్తం 198 (స్నాచ్ 88+ క్లీన్ అండ్ జర్క్ 111) కేజీల బరువు ఎత్తి రెండో ప్లేస్‌లో నిలిచింది. ఫలితంగా 1998లో కరణం మల్లేశ్వరి సిల్వర్ మెడల్ తర్వాత ఇండియా తరఫున మెగా గేమ్స్‌లో పతకం సాధించిన తొలి లిఫ్టర్‌గా మీరాబాయి రికార్డులకెక్కింది. ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌ల్లో పతకాలు సాధించిన మీరాబాయి కెరీర్‌లో ఇప్పటి వరకు ఆసియా పతకం మాత్రం లేదు.
తాజాగా ఆ లోటును కూడా పూర్తి చేసుకుని కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది. ‘ఆసియా క్రీడల్లో పతకం గెలవడం ఒక కల నిజమైనట్లుగా ఉంది. గత 12 ఏళ్లుగా నేను ఈ పతకం కోసం ఎదురుచూస్తున్నా. ఈ మెడల్‌తో నా జీవితం, కెరీర్ పరిపూర్ణమైంది. నాకు చాలా తేలికగా అనిపిస్తోంది’ అని మీరాబాయి పేర్కొంది. రెండుసార్లు వరల్డ్ చాంపియన్ రీ సాంగ్ గమ్ (ఉత్తర కొరియా) 215 (స్నాచ్ 94+క్లీన్ అండ్ జర్క్ 121) కేజీలు లిఫ్ట్ చేసి వరల్డ్ రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది.
ఫలితంగా ఆసియాలో మూడో టైటిల్‌తో హ్యాట్రిక్ పూర్తి చేసింది. పతకం గెలిచే క్రమంలో సాంగ్ గమ్ స్నాచ్, క్లీన్ అండ్ జర్క్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. లులుక్ డయానా ట్రి (ఇండోనేసియా) 191 (స్నాచ్ 88+ క్లీన్ అండ్ జర్క్ 103) కేజీల బరువు ఎత్తి కాంస్యం సొంతం చేసుకుంది.
2014 నుంచి పోరాటం..
2014 ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన మీరాబాయి 9వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. తర్వాత వెన్ను గాయంతో 2018 క్రీడలకు దూరమైంది. 2023 హాంగ్జౌ గేమ్స్‌లో వేదికపైనే తుంటి గాయం కావడంతో నాలుగో ప్లేస్‌కు పరిమితమైంది. కానీ నగోయాలో అలాంటి నాటకీయ పరిణామాలేమీ జరగలేదు. తన తల్లి బహుమతిగా ఇచ్చిన ఒలింపిక్ రింగుల ఆకారంలో ఉన్న బంగారు చెవిపోగులు ధరించి, జుట్టులో మూడు రంగుల రిబ్బన్ పెట్టుకుని మీరాబాయి స్పష్టమైన లక్ష్యంతో వేదికపైకి వచ్చింది.
83 కేజీలతో స్నాచ్‌ను ప్రారంభించి వరుసగా 85, 87 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. క్లీన్ అండ్ జర్క్‌లో స్టార్టింగ్‌లోనే 107 కేజీలను లిఫ్ట్ చేసింది. తర్వాత 111 కేజీలకు పెంచుకుంది. అప్పటికే సిల్వర్ మెడల్ ఖాయం కావడంతో మూడో ప్రయత్నం చేయలేదు. మీరాబాయి సంకల్పం, నిలకడ దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
కబడ్డీలో జైత్రయాత్ర
ఆసియా క్రీడల కబడ్డీ పోటీలలో ఇండియా మెన్స్, విమెన్స్ జట్లు దూసుకుపోతున్నాయి. విమెన్స్ విభాగంలో బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఇండియా 37–-23 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో 19–-15తో ఆధిక్యంలో నిలిచిన ఇండియా అమ్మాయిలు ద్వితీయార్ధంలో మరింత జోరు పెంచి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పూజా, నికితా అద్భుత ప్రదర్శన కనబరిచారు. గ్రూప్–ఎలో మెన్స్ టీమ్ 48–25తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. తొలి అర్ధభాగంలోనే 29-–9తో తిరుగులేని ఆధిక్యం సంపాదించిన ఇండియా టీమ్ మ్యాచ్ అంతటా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
బ్రాంజ్‌తో ‘జై’
నగోయా: సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో ఇండియా తొలి పతకంతో చరిత్ర సృష్టించింది. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్‌లో జై మీనా కాంస్యం పతకం నెగ్గాడు. బుధవారం జరిగిన ఫైనల్లో జై మీనా 2–4 (3–5, 1–4, 1–4, 4–1, 6–4, 1–4)తో తకుయా కురోసకా (జపాన్) చేతిలో ఓడి మూడో స్థానంలో నిలిచాడు.
45 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ ఆరంభంలో జై లయ అందుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. దాంతో తొలి మూడు గేమ్‌లు కోల్పోయి వెనకబడ్డాడు. ఆ తర్వాత పుంజుకుని చివరి రెండు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను ఉత్కంఠకు తీసుకెళ్లాడు. అయితే నిర్ణయాత్మక ఆరో గేమ్‌లో జపాన్ ప్లేయర్ అద్భుతంగా ఆడటంతో మీనాకు ఓటమి తప్పలేదు.
