టోక్యో పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం ఉదయం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో షూటర్ సింగ్రాజ్ అధానా కాంస్య పతకం సాధించగా.. మధ్యాహ్నం తర్వాత ఒకే ఈవెంట్‌లో ఇద్దరు అథ్లెట్స్ పతకాలు గెలిచారు. మెన్స్ కేటగిరీలో టీ63 హైజంప్ ఈవెంట్‌లో మన అథ్లెట్స్ సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మరియప్పన్ తంగవేలు సిల్వర్, శరద్ కుమార్ బ్రాండ్ మెడల్ సొంతం చేసుకున్నారు.
రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో బంగారు పతకంగా గెలిచిన మరియప్పన్ తంగవేలు ఈ సారి కూడా తీవ్రంగా ప్రయత్నించి మిస్ అయ్యాడు. టోక్యో పారాలింపిక్స్‌లో ఇవాళ జరిగిన హైజంప్ టీ63 కేటగిరీ ఈవెంట్‌లో అమెరికా అథ్లెట్ శామ్ గ్రెవ్, ఇండియన్ అథ్లెట్ మరియప్పన్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇద్దరూ 1.86 మీటర్ల మార్క్‌ను క్లియర్ చేశాక గోల్డ్ మెడల్ కోసం ఫైట్ మొదలైంది. అయితే ఆ సమయంలో వర్షం కురవడంతో అథ్లెట్స్‌కు పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత మూడు అటెంప్ట్‌లలోనూ 1.88 మీటర్ల ఎత్తును దూకడంలో మరియప్పన్ ఫెయిల్ అయ్యాడు. గ్రేవ్ మాత్రం చివరి రౌండ్‌లో ఆ ఎత్తును దూకేశాడు. గతంలో తను సెట్ చేసిన వరల్డ్ రికార్డ్ అయిన 1.90 మీటర్లను దాటి, ఇప్పుడు కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. టోక్యో పారాలింపిక్స్ ఈవెంట్‌లో 1.91 మీటర్ల ఎత్తును దూకాడు గ్రేవ్. దీంతో ఒక్కసారిగా అసాధారణమైన స్పోర్టివ్ స్పిరిట్‌ను ప్రదర్శిస్తూ ఇండియన్ ప్లేయర్లు సహా ఒలింపిక్ స్టేడియం అంతా అమెరికన్ పారాలింపియన్‌ను అభినందిస్తూ కేరింతలు చేసింది. దీంతో గ్రేవ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకోగా, మన మరియప్పన్ సిల్వర్ గెలుచుకున్నాడు. శరద్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. అయతే రియో పారాలింపిక్స్‌లో బ్రాంజ్ గెలిచిన వరుణ్ భాటి ఈ రోజు ఏడో స్థానానికి పరిమితమయ్యాడు.
ఓవరాల్‌గా సరికొత్త రికార్డు
పారాలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి ఇండియాకు సరికొత్త రికార్డు దక్కింది. ఇప్పటి వరకు రియా పారాలింపిక్స్‌లో మనోళ్లు సాధించిన నాలుగు మెడల్స్ ఓవరాల్ హయ్యెస్ట్‌గా ఉండేది. అయితే ఈసారి ఏకంగా మొత్తం పతకాల సంఖ్య ఇప్పటికే పదికి చేరాయి. ఇవాళ వచ్చిన మూడు పతకాలతో కలిపి పారాలింపిక్స్ మెడల్స్ డబుల్ డిజిట్‌కు చేరాయి.
