టమాట ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. గతేడాది లానే ఈసారి కూడా రోజు రోజుకు రేట్లు జంప్ అవుతున్నాయి. డిమాండ్కు తగ్గ పంట లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. రాబోయే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే చాన్స్ ఉన్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
సీజనల్ మిగులుతో టమోటాలతో నిండిపోయే తమిళనాడులోని ధర్మపురి జిల్లా వ్యాప్తంగా ఉన్న కూరగాయల మార్కెట్లు, ఇప్పుడు తీవ్రమైన ఉత్పత్తి కొరతతో దెబ్బతిన్నాయి. దీంతో.. మార్కెట్లలో కిలో టమాటా ధరలు రూ.18-20 నుంచి రూ.40-44 వరకు పెరిగాయి. సప్లై తగ్గిపోవడంతో టమాటా ధరలు కిలోకు రూ.60 వరకు కూడా పెరగవచ్చని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు తెలిపారు.
ధర్మపురి జిల్లాలో విస్తృతంగా సాగు చేసే పంటలలో టమాటా ఒకటి. పాలకోడ్, రాయకోటలోని మార్కెట్లలో టమాటాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. సాధారణంగా వేసవి కాలంలో.. అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా.. మార్కెట్లలో టమాటాలు విపరీతంగా పేరుకుపోతాయి. ఈ కారణంగా టమాటా ధర కిలోకు రూ. 5 కంటే తక్కువకు పడిపోతుంది. కానీ ఈ సంవత్సరం పరిస్థితి మారింది. సప్లై తగ్గిపోయిన కారణంగానే ధరలు పెరిగాయని అధికారులు పేర్కొంటున్నారు. మార్చి నెల ప్రారంభంలో వడగళ్ళు, బలమైన గాలుల కారణంగా పాలకోడ్ ప్రాంతంలో ఉత్పత్తి పూర్తిగా దెబ్బతింది. ఆ తర్వాత, వడగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో రైతులు టమాటా సాగును వదిలివేయడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా 500 ఎకరాలకు పైగా సాగు చేసే పాలకోడ్‌లో.. ఇప్పటికీ 200 ఎకరాల కంటే తక్కువ సాగు మాత్రమే ఉంది.
ఇక.. మన తెలంగాణలో టమాట సాగు చేసిన రైతులకు ఈ సీజన్‌లో కన్నీళ్లు తప్పడం లేదు. నెల క్రితం వరకు కేజీ రూ.50 పలికిన టమాట ధర ప్రస్తుతం రూ.5కే పరిమితమైంది. తెంపిన కూలీ, మార్కెట్‌కు తరలింపు ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. చాలామంది రైతులు పండిన పంటను చేనులోనే వదిలేస్తుండగా, మరికొందరు రిస్క్ తీసుకుని మార్కెట్‌కు తీసుకెళ్లినా సరైన ధర దక్కక ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఓ రైతు సంతలో టమాటాలను ఉచితంగా పంచగా ప్రజలు ఎగబడ్డారు.

