టమాట రేట్లు ఇప్పట్లో తగ్గవట

టమాట రేట్లు ఇప్పట్లో తగ్గవట
  • ఇంకో 2 నెలల పాటు టమాట మంట!
  • రేట్లు ఇప్పటిలో తగ్గవంటున్న క్రిసిల్‌‌‌‌‌ 


న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌లో  పెట్రోల్ రేట్లతో పోటీ పడి మరీ పెరుగుతున్న టమాట ధరలు  ఇంకో రెండు నెలల వరకు  తగ్గవని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసెర్చ్‌‌‌‌ ప్రకటించింది. టమాటాను ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో అధికంగా వర్షాలు కురవడంతో, వీటి సప్లయ్ తగ్గిపోయిందని  వెల్లడించింది. టమాటాను ఎక్కువగా పండించే కర్నాటకలో సాధారణం కంటే 105 శాతం ఎక్కువ వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 40 శాతం ఎక్కువగా, మహారాష్ట్రలో 22 శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి. అక్టోబర్–డిసెంబర్ మధ్య టమాట సప్లయ్ ఈ మూడు రాష్ట్రాల నుంచే ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో కేజి టమాట ధర రూ. 110 కి టచ్ చేసింది.  మధ్యప్రదేశ్‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌ల నుంచి టమాట సప్లయ్‌‌‌‌,  వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుందని క్రిసిల్ పేర్కొంది. అందువలన  జనవరి నుంచి టమాట ధరలు 30 శాతం మేర తగ్గొచ్చని అంచనావేసింది. ఉల్లిపాయలు ధరలు ఇంకో 10–15 రోజుల్లో దిగిరావొచ్చని క్రిసిల్ అంచనావేసింది. హర్యానా నుంచి  సప్లయ్ అందుతుందని పేర్కొంది. బంగాళదుంపల ధరలు తగ్గడానికి మాత్రం రబీ పంట చేతికందే వరకు వెయిట్ చేయాల్సిందేనని వివరించింది. అధిక వర్షాల వలన  ఉత్తరప్రదేశ్‌‌‌‌, వెస్ట్‌‌‌‌బెంగాల్‌‌‌‌, బిహార్‌‌‌‌‌‌‌‌, గుజరాత్ రాష్ట్రాలలోని  ఆలూ పంటలపై ప్రభావం పడిందని ఈ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. వర్షాలు ఇంకా కొనసాగితే, ఈ కూరగాయల ధరలు మరింత పెరగొచ్చని అంచనావేసింది. క్యాప్సికమ్‌‌‌‌, దోసకాయ వంటి కూరగాయల సప్లయ్ కూడా అధిక వర్షాల వలన దెబ్బతిందని క్రిసిల్ పేర్కొంది.