ములుగు/మంగపేట, వెలుగు: ములుగు జిల్లాను టోర్నడోలు వెంటాడుతున్నాయి. భారీ ఈదురుగాలులతో అటవీ ప్రాంతంలో బలమైన గాలులు రావడంతో పాటు సుడిగాలుల రూపంలో కూకటి వేళ్లతో వృక్షాలను నేలమట్టం చేస్తున్నాయి. 2024 ఆగస్టు 31న జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమీపంలో టోర్నడోతో భారీ విధ్వంసం జరిగింది. సరిగ్గా రెండేళ్ల తరువాత మంగపేట మండలం కోమటిపల్లి సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంగళవారం సాయంత్రం మళ్లీ ఈదురుగాలులతో కూడిన సుడిగాలులు వచ్చి వృక్షాలు నేలకూలాయి.
ఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు సందర్శించి ఎన్ని కిలోమీటర్ల నిడివిలో వృక్షాలు నేలకూలాయి..? ఎంత నష్టం జరిగింది..? అనే వివరాలను సేకరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండగా, కోమటిపల్లి, కాటారం రూట్ లో భారీ ఈదురుగాలులు రావడంతో పలు వృక్షాలు కూకటివేళ్లతో పెకిలించబడ్డాయి. మేడారంలో జరిగినట్లుగా ఎక్కువ మొత్తంలో నష్టం జరిగిందా..? లేదా అనేది తెలియలేదు.
కాటాపూర్వెళ్లే మార్గంలో శాంతినగర్సమీపంలో ప్రధాన రహదారి వెంట పలు వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ఐదు కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉందని స్థానికులు చెబుతున్నారు. మండలంలోని కమలాపురం వైపు నుంచి అటవీ ప్రాంతం మీదుగా కొత్తపేట వైపు టోర్నడో వెళ్లినట్లు పేర్కొన్నారు.
అదే ప్రాంతంలో శాంతినగర్, ముక్కుపోచమ్మ గొత్తికోయ గూడేలు ఉండగా, ఆ గాలులు గూడేల వైపు వస్తే భారీ నష్టం జరిగేదని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 22న కమలాపురం, ఏటూరునాగారం ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ఇదే తరహాలో వృక్షాలు నేలకూలాయి. వరుస ఘటనలతో ములుగు జిల్లా ప్రజలకు టోర్నడో భయం పట్టుకుంది. టోర్నడోతో పాటు మేడారం కేంద్రంగా గత ఏడాది భూకంపం రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నష్టంపై అంచనా వేస్తున్నాం..
అధిక వేగంతో వీచిన ఈదురుగాలుల కారణంగా ములుగు జిల్లా మంగపేట రేంజ్ పరిధిలోని మంగపేట సౌత్ బీట్ 5వ కంపార్ట్‌మెంట్ లో గల డంపిడి, కానుగ, ముస్తి, ఈపీ జాతులకు చెందిన కొన్ని చెట్లు నేలకొరిగినట్లు డీఎఫ్వో వికాస్ మీనా తెలిపారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాన్ని తమ సిబ్బంది పరిశీలించారని చెప్పారు. బలమైన గాలులతోనే చెట్లు నేలకొరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపారు. 20 నుంచి 30 చెట్లు నేలకొరిగాయని సమాచారం అందిందని, ఎంత మేరకు నష్టం జరిగిందనే అంశంపై అంచనా కొనసాగుతోందని చెప్పారు.
