‘దేశ రాజకీయాల్లో, ప్రజాసేవలో పురుషులతో సమానంగా పాల్గొనే హక్కు మహిళలకు ఉంది. అహింస మానవ జాతికి అందిన అత్యున్నత శక్తి. దీనిని పురుషుల కంటే స్త్రీలు మరింత సమర్థవంతంగా నిర్వహించగలరు’ అంటూ జాతిపిత మహాత్మా గాంధీ రాజకీయాల్లో మహిళలకు కల్పించాల్సిన ప్రాధాన్యత గురించి నొక్కిచెప్పారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్న కాంగ్రెస్ మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తూ వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తోంది. దేశంలో అత్యున్నత ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను మహిళలకు కట్టబెట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. దీనికి భిన్నంగా దురదృష్టవశాత్తు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో మహిళలను మోసం చేస్తోంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకొని తన సొంత అజెండాతో రాజ్యాంగానికి విరుద్ధంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తేవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు గతంలో ఈ కుటిల యత్నాలను విజయవంతంగా అడ్డుకోగా బీజేపీ మరోసారి ఇదే తరహా కుట్రలకు తెరలేపడంతో కలిసికట్టుగా వాటిని విఫలం చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉంది.
రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టగా పీవీ నరసింహారావు ప్రభుత్వం హయాంలో 73వ, 74వ రాజ్యాంగ సవరణలతో పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమైంది. ఈ చొరవతోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులుగా సేవలందిస్తున్నారు. అనంతరం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేయడం కూడా ఈ ప్రక్రియలో కీలక ఘట్టం. కాంగ్రెస్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యభూమిక నిర్వహించగా బీజేపీ రాజకీయం చేసింది. 2026 ఏప్రిల్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టింది. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ కుట్రను పసిగట్టిన కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలతో జతకట్టి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం చారిత్రాత్మకం.
మోదీ నియంతృత్వ పాలన
గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్వని బీజేపీ ఇప్పుడు మరింత కుట్రలకు తెరలేపి డీలిమిటేషన్ బిల్లును వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ముందుకొస్తోంది. గతంలో పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించిన పార్టీలను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చీలుస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ఎంపీల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. అక్రమంగా రాజ్యసభలో సభ్యుల సంఖ్య పెంచుకుంటోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించేలా చేసింది. పంజాబ్ నుంచి ఎన్నికైన ఆప్ రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకున్నారు. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ప్రతిపక్ష పార్టీల ఎంపీలను నయానా, భయానా లొంగదీసుకొని సంఖ్యా బలంతో వివాదాస్పదమైన బిల్లులను పాస్ చేయించుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
డీలిమిటేషన్ పారదర్శకంగా జరగాలి
నియోజకవర్గాల పునర్విభజనకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. అయితే ఎవరికీ అన్యాయం జరగకూడదని, ప్రాంతాల మధ్య సమతుల్యం దెబ్బతినకూడదనేది కాంగ్రెస్ ఉద్దేశం. జనాభా మార్పులకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు, అవసరమైతే స్థానాల సంఖ్య పునర్వ్యవస్థీకరించడం దీని లక్ష్యం. అయితే భారతదేశం వంటి సమాఖ్య వ్యవస్థలో ఇది కేవలం జనాభా లెక్కల అంశం మాత్రమే కాదు. ప్రాంతీయ సమానత్వం, రాష్ట్రాల ప్రాతినిధ్యం, జాతీయ సమగ్రత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అందుకే గతంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఆ తర్వాత మరోసారి వాజ్‌పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ ద్వారా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను నిర్దిష్ట కాలానికి నిలిపేసింది. జనాభా నియంత్రణ పాటించడంలో ముందున్న రాష్ట్రాలు నష్టపోకూడదనే నాడు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక ప్రాంతానికి అధిక రాజకీయ ప్రాధాన్యం, మరో ప్రాంతానికి తక్కువ ప్రాధాన్యం కలిగే పరిస్థితి ఏర్పడితే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉంది.
భిన్నత్వంలో ఏకత్వంభారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం
జనాభా ప్రమాణంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రస్తుత 543 ఎంపీ స్థానాలు 850కు పెంచే ఫార్ములాతో డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో 130 స్థానాలు 195కు, ఉత్తరాది రాష్ట్రాల్లో 413 స్థానాలు 621కు పెరుగుతాయి. భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలిచింది. దేశ సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల హక్కులు, ప్రాంతీయ సమతుల్యత, ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగం నిర్దేశించిన ప్రధాన సూత్రాలు. అలాంటి సమయంలో మహిళా సాధికారత పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లు దేశంలో రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నప్పటికీ, దీన్ని నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానించడంతో వివాదానికి కేంద్ర బిందువైంది. కాంగ్రెస్ పార్టీతోపాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే అంశంపై కలత చెందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బలం లేని బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యంతో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో విభేదాలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో ఉత్తరాదిలో సీట్ల పెంపుతో వీరి బలం మరింత పెరిగితే ఆ పార్టీ ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.
బేషరతుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
బీజేపీ అప్రజాస్వామికంగా పార్టీలను చీలుస్తున్న కుట్ర రాజకీయాలపై అప్రమత్తమైన పార్టీలు, మహిళా సంఘాలు మహిళా రిజర్వేషన్లపై చేస్తున్న తాత్సారం ఎత్తుగడలను గమనిస్తున్నాయి. పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఇటీవల గాంధీభవన్‌లో నన్ను కలిసి జనగణన, డీలిమిటేషన్ అంశాలతో ముడిపెట్టకుండా వెంటనే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కాంగ్రెస్ కూడా ఇదే ధోరణితో ఉంది. అయితే బీజేపీ వ్యూహాలు వేరుగా ఉన్నాయి. అయోధ్య రామ మందిరంలో నిధుల చోరీ, నీట్ పరీక్ష పేపర్ లీకు వంటి కీలక అంశాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా వాటిని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో ప్రమాదకర డీలిమిటేషన్ బిల్లును ముందుకు తెస్తోంది. మహిళా సాధికారిత కోసం వారికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పోరాడుతోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జనగణన, డీలిమిటేషన్‌లతో ఎలాంటి సంబంధం లేకుండా బేషరతుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడమే కాకుండా, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తక్షణమే అక్కడ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మిత్రపక్షాలను కలుపుకొని ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తోంది.
మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న బీజేపీ
వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో లంకెపెట్టి వారికి రాజకీయంగా అన్యాయం చేస్తున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టినా కాంగ్రెస్ బేషరతుగా సమర్థించింది. కాంగ్రెస్‌తో సహా ఇతర పక్షాలు మద్దతివ్వడంతో ఎన్డీఏ ప్రభుత్వం 2023లో మహిళా రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందడంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే మహిళలకు 33 రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వేదికగానే డిమాండ్ చేసింది. జనగణన, డీలిమిటేషన్ పూర్తవ్వాలనే నిబంధనలు పెట్టి బీజేపీ మహిళా రిజర్వేషన్లు అడ్డుకుంది. ఆమోదం పొందిన చట్టం ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించకుండా 2026 ఏప్రిల్‌లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన సవరణలతోపాటు డీలిమిటేషన్ చేస్తూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తేవడంతో కాంగ్రెస్, మిత్రపక్షాలు అడ్డుకున్నాయి.
- బి.మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
