కేటీఆర్‎కు సిగ్గులేదా.. గిరిజన బిడ్డే కదా అని చిన్న చూపా?

కేటీఆర్‎కు సిగ్గులేదా.. గిరిజన బిడ్డే కదా అని చిన్న చూపా?

హైదరాబాద్: రాష్ట్ర యువత డ్రగ్స్, మద్యం మత్తులో ఊగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదాయం కోసమే రాష్ట్ర సర్కార్ మద్యం, డ్రగ్స్‎ను ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు. సింగరేణి కాలనీలో జరిగిన హత్యాచార ఘటనలో నిందితున్ని కొన్ని గంటల్లోనే పట్టుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేయడం.. ఆ తర్వాత దాన్ని సరిచేసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిందితుడిని పట్టించినా, సమాచారం చెప్పినా రూ. 10 లక్షలు ఇస్తామని పోలీసులు చెప్పడం చూస్తుంటే.. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా అని ఆయన అన్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఏం చెబుతారని రేవంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిని పట్టుకున్నట్లు కేటీఆర్‎కు తప్పుడు సమాచారమిచ్చిందెవరని ఆయన అడిగారు. సింగరేణి కాలనీ ఘటన, రాష్ట్రంలో నడుసున్న డ్రగ్స్ దందాపై ఆయన గాంధీభవన్‎లో ప్రెస్‎మీట్ పెట్టి మాట్లాడారు.

‘రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుంది. అర్ధరాత్రి వరకు మీ బంధువుల పబ్బులు నడుస్తలేవా? డ్రగ్స్ అమ్మకాలు, వినియోగంలో సినీ ప్రముఖులు ఉన్నట్లు రెండేండ్ల కింద వెలుగులోకి వస్తే.. ఎంతటి వారినైన వదలం అని అప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ ఆ కేసును అర్దాంతరంగా తొక్కిపెట్టారు. ఆ కేసును సమర్థవంతంగా విచారిస్తున్న కమిషనర్ అకున్ సబర్వాల్‎ను బదిలీ చేశారు. ఇతర దేశాల్లో ఉత్పత్తి అయిన డ్రగ్స్‎ను మన వద్ద రుద్దుతుండ్రు. కార్పొరేట్ స్కూళ్లల్లో కూడా పిల్లలకు అలవాటు చేపిస్తుండ్రు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ చేయిస్తే.. అసలు దోషులు బయట పడతారు. బెంగుళూర్‎లో డ్రగ్స్ విచారణ జరిపితే.. ఇక్కడి టీఆర్ఎస్ నేతలు, హీరోల పేర్లు బయటకు వచ్చాయి. 

సింగరేణి కాలనీలో విచ్చల విడిగా గంజాయి అమ్ముతున్నరని కాలనీ వాసులు అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నరు. సింగరేణి కాలనీ రాష్ట్ర హోంమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఉంటది. కేటీఆర్‎ను ట్విట్టర్‎లో ప్రశ్నిస్తే తప్పించుకుంటుండు. కేసీఆర్, కేటీఆర్ మత్తులో జోగుతున్నారా? జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలో ఇంత పెద్ద ఘటన జరిగితే కనీసం పట్టించుకోవడం లేదు. కానీ మెట్రో సంస్థ నష్టాల్లో ఉందని.. సమీక్ష పెట్టి ఆదుకుంటామని చెప్పారు. కేటీఆర్‎కు సిగ్గులేదా.. పాశవికంగా జరిగిన ఈ ఘటనపై పట్టింపులేదా లేకపోతే చనిపోయింది 
గిరిజన బిడ్డే కదా అని చిన్న చూపా?’ అని రేవంత్ ప్రశ్నించారు.