స్వలాభం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన్రు

స్వలాభం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన్రు

అందరి అభిప్రాయాల మేరకే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎంపిక జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబంతో దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి మంచి అనుబంధం వుందన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని స్రవంతికి అధిష్టానం అవకాశం ఇచ్చిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాలకోసం పార్టీ వీడి బీజేపీలో జాయిన్ అయ్యారని ఆరోపించారు. మునుగోడులో ఇప్పటికే కమిటీలు వేసి ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఇన్ చార్జీలను వేసి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు. స్వలాభం కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. 

బీజేపీ, టీఆర్ఎస్ రెండు బహిరంగ సభలు పెట్టిన అభ్యర్థులను ప్రకటించలేకపోయాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ రెండు పార్టీలు భయంతోనే అభ్యర్థులను అనౌన్స్ చేయలేకపోతున్నాయని తెలిపారు. అభ్యర్థి ఎంపికలో కాగ్రెస్ మొదటి నుంచి క్లారిటీగా ఉందన్నారు. అందరికంటే ముందుగానే పాల్వాయి స్రవంతిని ప్రకటించామన్నారు. 

కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, బీజేపీ ఒకరినొకరు సహకరించుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.మునుగోడు అభివృద్ధికి ఈ రెండు పార్టీలు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. ఈనెల 18న నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి  ప్రచారం ముమ్మరం చేస్తామన్నారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరల పెంపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఎండగడతామన్నారు. మునుగోడులో సాగునీరు లేకపోవడంతో ఇంకా ఫ్లోరైడ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ -, విజయవాడ జాతీయ రహదారి వెడల్పు చేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయడం సరికాదన్నారు. గిరిజనులకు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో వసతలు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..స్టూడెంట్స్ చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏమీ చెయ్యని ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలను కేసీఆర్  కలిసినా ఉపయోగం లేదన్నారు పక్క రాష్ట్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు కలవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే టీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని..భారత్ జోడో యాత్ర కు మంచి ఆదరణ వస్తుందన్నారు.