కేసీఆర్ నయా ఫ్యూడలిజం తెచ్చిండు

కేసీఆర్ నయా ఫ్యూడలిజం తెచ్చిండు

ఖైరతాబాద్, వెలుగు: ‘‘కేసీఆర్ బర్లు, గొర్లు మాకిచ్చి.. రాజ్యం మాత్రం కేటీఆర్‌‌కు ఇస్తాడా? ఇదెక్కడ న్యాయం’’ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ నయా ఫ్యూడలిజం తీసుకొచ్చారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల కోసం తెలంగాణ తెచ్చుకోలేదన్నారు. ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం రచించిన దాలి, చేదు నిజం పుస్తకాల ఆవిష్కరణ సభ ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యకమ్రంలో రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో జరిగిన, కాల గర్భంలో కలిసిపోయిన ఘటనలను వెలికి తీసుకొచ్చే ప్రయత్నం ‘చేదు నిజం’ పుస్తకం ద్వారా చేయడం మంచి పరిణామమన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమం పేరు మీద తనకు తాను ఎక్కువ ప్రచారం చేసుకున్న వ్యక్తి కేసీఆర్. ఆయన కంటే ముందే ఉద్యమంలో భాగంగా 42 మంది ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి నాయకత్వంలో సోనియాగాంధీకి ప్రత్యేక తెలంగాణ కోరుతూ లేఖ రాశారు. నాడు చిన్నారెడ్డి తెలంగాణ కోసం వనపర్తిలో సభ కూడా పెట్టారు” అని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల త్యాగాలను, కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. 

నిజాం కన్నా ఎక్కువ కేసీఆర్ చేసిందేమీ లేదు

‘‘నాడు తెలంగాణ ప్రజలు కేవలం సంక్షేమ కోసం నిజాంతో కొట్లాడలేదు. స్వేచ్ఛ కోసం కొట్లాడారు. మోజంజాహీ మార్కెట్ నుంచి చార్మినార్ దాకా అన్ని ఆసుపత్రులు, సౌలతులను నిజాం కల్పించారు. నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి వాళ్లు సంక్షేమం ఇచ్చినా.. అన్నిటినీ పక్కన పెట్టి తెలంగాణ కోసం ప్రజలు కొట్లాడారు. నిజాం నవాబ్ కంటే కేసీఆర్ ఎక్కువ మేలు చేసిందేమీ లేదు” అని రేవంత్ విమర్శించారు. వర్గీకరణ కోసం 25 ఏళ్ల నుంచి మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమం కంటే కేసీఆర్ ఉద్యమం గొప్పదా అని ప్రశ్నించారు. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ ఆడ బిడ్డల్ని వివస్త్రలను చేసి కొట్టించిన చరిత్ర ఆయనదని 
మండిపడ్డారు. 

కేసీఆర్ ఫ్యామిలీకీ రాజపక్సల గతే: మధుయాష్కీ

మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ.. కేసీఆర్ కాపలా కుక్క కాదని, కాటేసే నక్క అని ఫైర్ అయ్యారు. కేవలం తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ప్రజలు, ప్రొఫెసర్లు తలుచుకుంటే దుర్మార్గుడైన కేసీఆర్‌‌ను దించడం పెద్ద పనేమీ కాదన్నారు. పుస్తకాల రచయిత పురుషోత్తం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఉద్యమకారులు తమ చరిత్రను తామే రాసుకోవాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కేశవ్ రావు జాదవ్ లేనిదే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదన్నారు.