
- ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ
- రెండు, మూడు రోజుల్లో ప్రకటన
- కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లకే కార్యవర్గం పరిమితం
- నలుగురి నుంచి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్, 20 నుంచి 25 మంది వైస్ ప్రెసిడెంట్స్
- మిగతా కార్యవర్గం డీసీసీ చీఫ్ నియామకాలతోనే..
హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గం ప్రకటనకు హైకమాండ్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ రెండు రోజులపాటు అక్కడే ఉండి.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసి కార్యవర్గంపై చర్చించారు. పీసీసీ కార్యవర్గానికి వారి నుంచి ఆమోద ముద్ర వేయించుకున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లో కార్యవర్గం ప్రకటన వెలువడనుంది. అయితే మొదటి విడతలో కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లను మాత్రమే ప్రకటించనున్నారు. మిగితా కార్యవర్గాన్ని డీసీసీ చీఫ్ లతోపాటు వెల్లడిస్తారు. నలుగురు నుంచి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 నుంచి 25 మందితో పార్టీ ఉపాధ్యక్షులను నియమించనున్నారు.
నలుగురు నుంచి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ మహిళా కోటా నుంచి ఒకరికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ చీఫ్ రోహిణ్ రెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో విప్ బీర్ల అయిలయ్య, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరితా యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఎస్సీ కోటాలో విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పోటీ పడుతున్నారు. ఇక మైనార్టీ కోటాలో మాజీ ఎంపీ అజారుద్దీన్, నాంపల్లి ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్, మాజీ ఎన్ఎస్యూఐ నేత అజ్మతుల్లా హుస్సేనీ పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఎవరి పేర్లకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది పీసీసీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇక ప్రస్తుత కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న కొందరికి ఉపాధ్యక్షులుగా పదోన్నతి కల్పించనున్నారు. 10 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిథ్యం ఉండేలా ప్రతి జిల్లాకు కనీసం ఇద్దరు ఉపాధ్యక్షులను నియమించనున్నారు.
ఈ నెల 20లోపు మిగితా కార్యవర్గం
పీసీసీ కార్యదర్శులను, ఇతర కార్యవర్గాన్ని డీసీసీ అధ్యక్షుల నియామకంతోపాటు ఈ నెల 20 లోపు ప్రకటించనున్నారు. పీసీసీ చీఫ్ గా నియమితులైన దాదాపు 8 నెలల తర్వాత మహేశ్ గౌడ్ కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నారు. 3 నెలల క్రితమే పీసీసీ కార్యవర్గ జాబితా ఫైనల్ చేసి, ప్రకటించే సమయంలోనే పార్టీ ఇన్చార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి బదిలీ కావడంతో.. ఆ జాబితాను పక్కన పెట్టారు. ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మళ్లీ ఈ జాబితాను పరిశీలించి, ఆ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులతో కార్యవర్గ ప్రకటన మరింత ఆలస్యమైంది.