హైదరాబాద్: సంక్రాంతి అయిపోయింది. పండగ సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లినవారంతా మళ్లీ పట్నం బాట పడతారు. ముఖ్యంగా ఏపీ వాసులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు రిటర్న్ అవుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి నల్లగొండ పోలీసులు కీలక సూచన చేశారు. విజయవాడ-హైదరాబాద్ (NH-65) హైవేపై చిట్యాల, పెద్దకాపర్తి దగ్గర ఫ్లైఓవర్ పనుల కారణంగా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
సంక్రాంతికి వెళ్లిన వారు పెద్దఎత్తున తిరిగి పట్నం బాట పడతారని.. దీంతో చిట్యాల, పెద్దకాపర్తి దగ్గర ఫ్లైఓవర్ పనుల కారణంగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవే:
* గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ వైపు
* మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ వైపు మల్లింపు
* నల్లగొండ → మార్రిగూడ బైపాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ (NH-65)
* విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలు కోదాడ–హుజూర్నగర్–మిర్యాలగూడ–హాలియా–చింతపల్లి–మాల్ మార్గం
* NH-65 లో తీవ్ర జామ్ అయితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు మళ్లింపు
* ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం
* అత్యవసరమైతే డయల్ 100 ను సంప్రదించాలి
* ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించి ఓర్పుతో ప్రయాణించాలి
